Advertisement
Google Ads BL

జగన్.. ఇకనైనా మారాల్సిందే!


మార్పు మంచిదే.. ట్రై చేయ్ జగన్!

Advertisement
CJ Advs

జీరో నుంచి హీరో అయినా.. హీరో నుంచి మళ్లీ జీరో అయినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఏ మాత్రం మార్పు రాలేదు..! జీరోతో మొదలై 67 సీట్లు దక్కించుకున్నా.. అక్కడ్నుంచి ఎవరూ కలలో కూడా ఊహించని విధంగా 151 కి వచ్చినా.. ఇటు నుంచి ఘోరాతి ఘోరంగా 11కు పడిపోయినా.. అదేనండోయ్ ప్రతిపక్ష హోదా పోయినా మనిషి మారలేదు..! అవును మార్పు ఎందుకు రావాలి..? ఆయన స్టయిలే అంతబ్బా.. ఎందుకీ గోల అనుకుంటున్నారేమో..! అబ్బే అవన్నీ ఆయన వ్యక్తిగతం.. మాకు కూడా అప్రస్తుతం అంతే..! అసలు విషయమేంటో తెలుసుకోవాలంటే ఈ ప్రత్యేక కథనం చదివేయాల్సిందే మరి.

ఇంత చెత్తగా..!?

వైసీపీ ఎలా, ఎందుకు స్థాపించాల్సి వచ్చింది..? ఎలా ఎదిగింది..? 2019 ఎన్నికల్లో ఏ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిందనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2024లో ఎందుకిలా ఒక్కసారిగా పడిపోయింది. వైసీపీకి వచ్చిన పెద్ద రోగమేంటి..? దానికి వేయాల్సిన మందేంటి..? ఎలా ఉన్న పార్టీ ఇలా అయిపోయిందేంటి..? అన్నది ఇప్పుడు ఏ కార్యకర్త నోట విన్నా.. ఏ నేత నోరు తెరిచినా వస్తున్న మాట. దీనంతటికి రాజకీయ విశ్లేషకులు, సొంత పార్టీ నేతలు, జగన్ అంటే పడిచచ్చే వీరాభిమానులు, కార్యకర్తలు చెబుతున్న ఒకే ఒక్క మాట.. సలహాదారులు..! అసలు ఆయనకు ఎవరు..? ఎందుకు..? ఏ పరిస్థితుల్లో సలహాలు ఇస్తున్నారో కానీ చెత్త కంటే దారుణంగా సారీ.. చెత్త అయినా రీ సైక్లింగ్‌కు పనికొస్తుందేమో అంతకంటే దారుణంగా ఉన్నాయ్ సలహాలు. బాబోయ్ ఆ సలహాలు అనే మాటకు ప్రాణం ఉండి ఉంటే గత ఐదేళ్ల నుంచి ఎన్ని సార్లు సచ్చిపోయేదో..! ఇది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా.. అక్షరాలా నిజమిదే.. నమ్మి తీరాల్సిందే.

ఒక్కరంటే ఒక్కరూ..!

సలహాదారులు అంటే ఏం చేయాలి.. సలహాలు ఇవ్వాలి.. అవి కూడా సభ్య సమాజానికి పనికొచ్చేలా ఉండాలి. ఎందుకంటే లక్షలు లక్షలు జీతాలు తీసుకుంటున్నారు కదా.. ఆ మాత్రం సలహాలు ఇవ్వకపోతే ఎలా..?. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన సొంత మీడియాలో పనిచేసిన, ఇతర రంగాల్లో ఉన్న.. అసలు ప్రభుత్వం అంటే ఏంటో తెలియకపోయినా వారందర్నీ సలహాదారులుగా తీసేసుకున్నారు జగన్. పోనీ.. ఐదేళ్లుగా కుహనా మేథావులుగా చెప్పుకుంటున్న అదేనబ్బా సలహాదారులు ఇచ్చిన పనికొచ్చే ఒక్క సలహా ఏంటో చెప్పగలరా..? గుండెల మీద చేయి వేసుకుని తీసుకున్న జీతానికి న్యాయం చేశాను.. ఇదిగో ఈ సలహా పనికొచ్చింది..? అని పదుల సంఖ్యలో ఉన్న సలహాదారులు ఒక్కరైనా చెప్పగలరా..? మరీ ముఖ్యంగా వైఎస్ జగన్ ఆత్మీయుడు, సఖల శాఖా మంత్రిగా ఫీలైన సజ్జల రామకృష్ణారెడ్డి అయినా చెప్పగలరా..? అంటే క్వశ్చన్ మార్క్‌, క్వశ్చన్‌లే తప్ప సమాధానం రాదు అంతే..!

ఎందుకిలా జగన్..?

అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ చెత్త సలహాలు విన్నారు తూ.చ తప్పకుండా పాటించి 151 సీట్లున్న వైసీపీకి 5 పక్కకెళ్లి 11 మిగిలాయి. అయినా వైఎస్ జగన్ ఇంకా ఎందుకు మారట్లేదు..? ఇంత జరిగాక కూడా అవే సలహాలు ఎందుకు..? జగన్‌కు ఐదేళ్లలో ఇచ్చిన సలహాలన్నింటిలో కల్లా చెత్త సలహా ఏదైనా ఉందా అంటే.. ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు లేఖ రాయడమే. అసలు ఈ ఆలోచన ఇచ్చిందెవరో కానీ ఎంత దారుణంగా ఉందో గత 24 గంటలుగా నడుస్తున్న ట్రోలింగ్స్, అధికార పక్షం నుంచి వస్తున్న కామెంట్స్‌ను బట్టి వాళ్లకే అర్థమయ్యి ఉంటుంది. ఇప్పటికీ అవే సలహాలు ఎందుకబ్బా..? బుర్రకు పనిబెట్టి (మొద్దుబారిన మైండ్‌కు) ఇకనైనా మారి స్వతహాగా ఆలోచించడం పనిపెడితే మంచిదని కార్యకర్తలు చెబుతున్నారు. 2014, 2019లో ఉన్న వైఎస్ జగన్ ఇప్పుడు ఏమయ్యారు..? నాటి రాజకీయం, రాజకీయ చాణక్యత ఏమైంది..? ఒకసారి గతానికి వెళ్లి మళ్లీ జీరో నుంచి మొదలు పెట్టాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయినా సరే నేను మారను.. నేనింతే.. అని మొండిగా ఉంటే.. ఇప్పుడున్న క్రికెట్ టీమ్, రేపొద్దున్న వాలీబాల్ టీమ్ అవ్వొచ్చు.. ఏకలింగం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.. సో.. నిండా మునిగిన జగన్ ఇక లేచి బౌన్స్ బ్యాక్ కావాల్సిన సమయం ఆసన్నమైంది.. లెట్స్ గో..!!

Jagan.. must change soon!:

Change is good.. Try it Jagan!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs