పవన్.. రియల్ లైఫ్ స్క్రిప్ట్ 21 అదిరిపోలా!
దేవుడి స్క్రిప్ట్.. పైనున్నోడు, ప్రజలు గూబ గుయ్యమనేలా కొట్టారు..! ఇలాంటి మాటలు మనం చాలా సందర్భాల్లోనే వినే ఉంటాం.. టీవీలు, సోషల్ మీడియాలో చూశాం!. అచ్చం అదే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రియల్ లైఫ్‌లో జరిగింది. అసలు ఇది యాదృచ్ఛికమో లేకుంటే మరేదో తెలియట్లేదు కానీ.. బాబోయ్ దిగిపోయింది. ఎటుచూసినా 21 అయ్యింది.. దీంతో జనసైనికులు, మెగాభిమానులు ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఇంతకీ ఏంటా సంగతి..? ఏమిటా స్క్రిప్ట్..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
ఇదీ అసలు సంగతి..!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కనివినీ ఎరుగుని రీతిలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్.. ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ వేదికగా.. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణం కూడా చేశారు. ఇక అసలు విషయానికొస్తే.. ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన 21 సీట్లు తీసుకుంది. రాయలసీమలో అంతంత మాత్రంగా.. గోదావరి జిల్లాలపైనే ఫుల్ ఫోకస్ పెట్టిన పవన్ తాను గెలవడమే కాకుండా 21 సీట్లలోనూ గెలిపించుకుని అసెంబ్లీలోకి తెచ్చుకున్నారు. అంటే 21 సీట్లు తీసుకుని.. 21 స్థానాలూ గెలిచి.. 21 మంది ఎమ్మెల్యేలతో.. 21వ తేదీన అసెంబ్లీలోకి అడుగుపెట్టారు పవన్. చూశారా.. ఇలాంటి స్క్రిప్ట్ మామూలుగా అయితే సినిమాల్లో.. ఏదైనా ఆటల్లో మాత్రమే చూసుంటాం కానీ ఇలా రియల్ లైఫ్‌లో బహుశా తొలిసారేమో..!
ఎన్నో అవమానాలు!
2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ను.. అసలు అధ్యక్షుడేనా..? దేశంలో ఎక్కడైనా ఇలాంటి వ్యక్తి ఉన్నారా..? మూడు పెళ్ళిళ్లు.. ముగ్గురు పెళ్లాలు.. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం.. బాబోయ్ ఇలా ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వైసీపీ నేతలు మొదలుకుని సీఎం వరకూ ఎవరి నోట చూసినా ఇవే మాటలు వినిపించాయి. మరికొందరైతే పవన్ తల్లిని కూడా దూషించారు. వీటన్నింటినీ భరించిన సేనాని.. కసితో పనిచేశారు. ఐదంటే ఐదేళ్లలో తానేంటో నిరూపించుకున్నారు. కూటమి కట్టడం మొదలుకుని, ప్రభుత్వ ఏర్పాటు వరకూ అన్నింటిలోనూ కీలక పాత్ర పవన్‌దే. అది కూడా 100% స్ట్రైక్ రేట్‌తో అంటే మామూలు విషయం అస్సలు కాదు. ఇక గేటు తాకనివ్వమన్న వాళ్లందరూ గేటు బయటే అదేనబ్బా ఓడిపోయి ఇంటికి పరిమితం కాగా.. డిప్యూటీ సీఎం.. కీలక శాఖల మంత్రిగా పవన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. చూశారుగా.. రియల్ లైఫ్‌లో స్క్రిప్ట్ అంటే ఎలా ఉంటుందో..!