బాక్సాఫీసు దగ్గర టికెట్లు తెగుతూ.. ప్రేక్షకుల హడావుడి కనిపించి ఎంత కాలమైందో అందరికి తెలుసు. సంక్రాంతికి పోటాపోటీగా హనుమాన్, గుంటూరు కారం, నా సామిరంగా లాంటి చిత్రాలు హడవిడి చేసిన తర్వాత వచ్చిన సినిమాల్లో కేవలం రెండు మూడు చిత్రాలు మాత్రమే ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేసాయి తప్ప ఈమధ్య కాలంలో ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ఆకలి తీర్చలేకపోయాయి.
గత వారం విడుదలైన విజయ్ సేతుపతి మహారాజ చిత్రం డబ్బింగ్ చిత్రమైనా అది హిట్ అవడంతో కాస్త ప్రేక్షకుల్లో కదలిక వచ్చింది. ఈ వారం చెప్పక్కర్లేదు. వరసగా చిన్న సినిమాల హడావిడి. అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకులకి కూడా తెలియవు. వరుణ్ సందేశ్ నింద, వెన్నెల కిషోర్ OMG, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్ష్ప్రెస్స్ తప్ప మరో సినిమా పేరు కూడా ప్రేక్షకులకి తెలియని పరిస్థితి.
మరి బోరుమంటున్న బాక్సాఫీసుని కదిలించేది, ప్రేక్షకుల నీరసాన్ని వదిలించేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి నే. వచ్చే శుక్రవారం కల్కి 2898 AD చిత్రం భారీ అంచనాలు నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎన్నో కాదు ఎన్నెన్నో అంచనాలు ఈ చిత్రం పై ఉన్నాయి. ప్రేక్షకుల ఆశ, ఆత్రుత అన్ని కల్కి పైనే. చాలా హైప్ తో రాబోతుంది.
మరి కల్కి కోసం బాక్సాఫీసు కూడా రెడీ అవుతుంది. కల్కి బుకింగ్స్ ఓపెన్ అవడమే తరువాయి.. రికార్డ్ స్థాయిలో కల్కి టికెట్స్ తెగడము, మొదటి రోజు ఓపెనింగ్స్ తోనే సన్సేషనల్ నంబర్స్ కలెక్ట్ చెయ్యడము పక్కాగా కనిపిస్తుంది. జస్ట్ హిట్ టాక్ వచ్చినా చాలు కల్కి బాక్సాఫీసుని కుమ్మి కుమ్మి వదిలిపెడుతుంది.