మహిళలకి ఇప్పుడు వంటగది కష్టాలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రీతిలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. పదేళ్లుగా అధికారంలో ఉన్న BRS ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ తెలంగాణాలో అధికారాన్ని చేపడితే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని నామ రూపాలు లేకుండా చేసేసింది కూటమి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదంతా చెప్పుకోవడానికి, వినడానికి సోషల్ మీడియాలో ఇంకా హాట్ టాపిక్కే.
అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా చోట్ల వంటింటి గృహిణులకు నిత్యావసరాలు పెరిగిపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉల్లి ఘొల్లుమనిపిస్తుంటే టమాటా మహిళకి రక్త కన్నీరు తెప్పిస్తుంది. నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన ఉల్లి, టమాటా రేట్లు చూస్తే మహిళలకి ఏడుపొక్కటే తక్కువ. ప్రస్తుతం ఉల్లి రేటు 50 దాటగా.. టమాటా ధర 100 నుంచి 120 పలుకుతుంది.
విపరీతమైన ఎండలు ఉండడంతో వర్షాలు లేకపోవడంతో టమాటా దిగుబడి తగ్గిపోయింది. దానితో ధరలకు రెక్కలొచ్చాయి. ఏడాదిలో ఏదో ఒక నెలలో ఇలా టమాటా ధరలు పెరగడం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఈ ఏడాది జూన్ నెలలోనే టమాటా, ఉల్లి ఘాటు వేడెక్కింది. అవే కాదు ప్రతి ఒక్క కూరగాయ రేటు బాగా పెరిగిపోయింది. సొరకాయ, వంకాయ, బీరకాయ ఇలా చాలా రకాల కూరగాయల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. మళ్లి ఉల్లి, టమాటా దిగుమతులు పెరిగితే ఈ అధిక ధరలకు అడ్డు కట్ట వేసే అవకాశం ఉంది అంటుంటే.. గతంలో రూపాయికి అమ్మి నష్టపోయిన రైతులు.. ఇలానే ధరలు మరికొద్ది రోజులు నడిస్తే తాము ఒడ్డెక్కుతామనే భావనలో ఉన్నారు. మరి ఎవ్వరు ఎలా ఉన్నా.. ఈ అధిక ధరల భారానికి బలవ్వాల్సింది మాత్రం మహిళలే.