పవన్ కల్యాణ్.. అంటే చాలు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, అధికారులు ఎక్కడ లేని గౌరవం ఇస్తున్నారు!. ఎందుకంటే.. కూటమి గెలుపులో కీలక పాత్ర పోషించడంతో ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గకుండా కీలక శాఖలు, అందులోనూ ఇష్టమైనవి కట్టబెట్టడం మొదలుకుని సెక్రటేరియట్‌లో చాంబర్ల వరకూ ఏం కావాలన్నా సరే పవన్ ఇష్టమంటూ చెప్పేస్తున్నారు. తాజాగా చాంబర్ విషయంలో డిప్యూటీ సీఎం వర్సెస్ ఆర్థిక మంత్రి మధ్య వివాదం నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. దీనిపై ఆర్థిక మంత్రి పయ్యావుల క్లారిటీ ఇచ్చుకున్నారు. మరోవైపు.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశాక తొలిసారి సెక్రటేరియట్‌కు వెళ్లిన పవన్ అన్ని చాంబర్లు పరిశీలించి.. సంబంధిత శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు.
ఏం జరిగింది..?
ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాక ఒక్కొక్కరుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇక సెక్రటేరియట్‌లో పేషీలు కూడా ఎవరికి నచ్చినవి వారు తీసుకునే పనిలో ఉన్నారు. ఇప్పటికే కొందరు మంత్రులు పేషీలు సెలక్ట్ చేసుకుని బాధ్యతలు స్వీకరించగా.. ఇంకా కొందరికి ఖరారు కావాల్సి ఉంది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ ఉన్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య పేషీల విషయంలో ఒకింత వివాదం నడుస్తోందని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. పవన్‌కు కేటాయించిన పేషీలు పయ్యావుల కావాలని కోరారని దీంతో వివాదం తలెత్తిందని కొన్ని పత్రికలు, టీవీ చానెల్స్‌లో వార్తలొచ్చాయి. ఇందులో నిజమెంత..? నిజంగా రచ్చ నడుస్తోందా..? అనే విషయాలపై ఆర్థిక పయ్యావుల ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు.
పవన్.. మీ ఇష్టం!
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ పేషీ కావాలంటే అది తీసుకోవచ్చని.. ఆయనే తమకు మొదటి ప్రాధాన్యతని పయ్యావుల చెప్పుకొచ్చారు. ఛాంబర్‌ల గురించి తాను ఎవరితోనూ మాట్లాడలేదని.. ఇంతవరకు పేషీలు గురించి అడగలేదని కూడా స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏ పేషీ ఇస్తే అందులో ఉంటానని.. పేషీ గురించి వివాదం ఉందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. సెకండ్ బ్లాక్‌లో ఫైనాన్స్ అని స్టిక్కర్ ఎప్పుడో అంటించి ఉందని.. ఎందుకంటే సెకండ్ బ్లాక్‌లో ఫైనాన్స్, ప్లానింగ్ శాఖలు ఉన్నాయన్నారు. అయినా సరే పవన్ ఏది కావాలంటే ఆ పేషీ తీసుకోవచ్చని పయ్యావుల స్పష్టం చేశారు. మొత్తానికి చూస్తే.. రెండ్రోజులుగా నడుస్తున్న వివాదానికి పయ్యావుల అయితే ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఎందుకు రచ్చ జరిగింది..!?
మరోవైపు.. ఇవాళ సెక్రటేరియట్‌కు వెళ్లిన పవన్ కల్యాణ్ పేషీలు అన్నీ పరిశీలించారు. తనకు ఏ పేషీ కావాలనే దానిపై ఓ స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. మరికాసేపట్లో ఈ పేషీలకు సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంగా రేపు అనగా బుధవారం నాడు సేనాని బాధ్యతలు స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సంకేతిక శాఖలను దక్కించుకున్న పవన్.. బాధ్యతలు స్వీకరించాక పర్యవేక్షించనున్నారు. కాగా.. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్ మార్చారని వార్తలు వచ్చాయి. ముందుగా 212, 214 రూమ్‌లు పవన్‌కు కేటాయించగా ఆ తర్వాత ఆ ఛాంబర్ ఆర్థిక మంత్రి కావాలని అడగడంతో పవన్ కోసం 211 రూమ్ కేటాయించినట్లు సచివాలయం వర్గాలు తెలిపాయి. అయితే.. ఈ మొత్తం వ్యవహారంపై పయ్యావుల స్పందించి.. పవన్ కోసం తన చాంబర్‌నే త్యాగం చేసినట్లయ్యింది.