అవును.. నారా చంద్రబాబు అంటే భయపడిపోతున్నారు..! ఎంతలా అంటే దరిదాపుల్లోకి రావడానికే జంకుతున్నారు..! బాబోయ్ బాబు ఇంత కఠినంగా మారేంట్రా బాబూ అని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి. ఈ బాబు ఆ బాబు కాదండోయ్ అంటూ ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఎంత పరిచయం ఉన్నోళ్లయినా.. ఏ స్థాయిలో ఉన్నా.. సీనియర్లు అయినా సరే అస్సలు లెక్క చేయట్లేదట. ఆఖరికి చినబాబు నారా లోకేష్‌కు టచ్‌లోకి వెళ్లినా సరే డోంట్ కేర్ అని చెప్పేస్తున్నారట . ఎందుకింతలా భయపడిపడుతున్నారు..? అంతలా చంద్రబాబు ఎందుకు భయపెడుతున్నారు..? ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి మరి..!
అసలేం జరిగింది..?
2024 ఎన్నికల ముందు.. ఫలితాల తర్వాత చంద్రబాబు నిజంగానే మారిపోయారు. ఎంతలా అంటే ఎలాంటి వారినైనా, ఎంతటి సీనియర్ అయినా సరే డోంట్ కేర్ అంటూ పక్కన పెట్టేస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో ఇదంతా జరుగుతోందనే అనుమానం వచ్చింది కదూ. అదేనండోయ్ టీడీపీలో చేరికలపై.. పార్టీ అధికారంలో లేనప్పుడు ఇతర పార్టీల్లోకి వెళ్లిన, మరీ ముఖ్యంగా వైసీపీలో చేరిన నేతలకు తిరిగి రావడానికి ప్రయత్నాలు చేయాల్సిన అసరం లేదని తేల్చి చెప్పేస్తున్నారు. ఒకరు పోతే ఏంటి.. పదుల సంఖ్యలో లీడర్లను తయారు చేస్తాం.. ఉడుకు రక్తం దొరకదా ఏంటని చంద్రబాబు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే టీడీపీ పరిమితం కావడం ఇందులోనూ వల్లభనేని వంశీ లాంటి వారు పార్టీకి నమ్మక ద్రోహం చేసి వైసీపీలో చేరడంతో ఇలాంటి వాళ్లనా టీడీపీలో పెంచి పోషించిందని నాటి నుంచి మదనపడుతున్నారట. అందుకే పార్టీ నుంచి బయటికి వెళ్లిన ఏ ఒక్కరినీ తిరిగి తీసుకునే ఉద్దేశం లేదని.. తలుపులు మూసేశారట.
ఇప్పుడెందుకు ఇదంతా..?
ఇదంతా ఇప్పుడు ఎందుకు నడుస్తోందంటే.. సీనియర్ నేత, మాజీ మంత్రి.. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన శిద్ధా రాఘవరావు 2019 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం ఓడిపోయిన తర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. 2024 ఎన్నికల్లో తాను కానీ.. తన కుమారుడిని కానీ దర్శి నుంచి పోటీ చేయించాలని ఎన్నో కలలు కన్నారు కానీ అవేమీ సాకారం కాలేదు. దీనికి తోడు ఈ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలవ్వడంతో ఉన్న వ్యాపారాలను, కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం తిరిగి సొంత గూటికి అదేనండోయ్ సైకిలెక్కడానికి సన్నాహాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ రాజీనామా చేసి.. ఆ లేఖను పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. ఇక టీడీపీలోకి వెళ్దామని చంద్రబాబు, నారా లోకేష్‌లను సంప్రదించగా నో ఛాన్స్ అంటూ ఒకే ఒక్క మాటతో తేల్చేశారట. నాడు పరిస్థితులు వేరు సార్ అర్థం చేసుకోండని బతిమలాడినా సరే సమస్యే లేదు.. పదే పదే ఫోన్లు చేసి విసిగించకండని చెప్పారట. దీంతో ఉన్నదీ పాయే.... అన్నట్లుగా శిద్ధా పరిస్థితి ఏర్పడింది. చూశారుగా.. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు వీడి.. అధికారంలోకి వచ్చాక తిరిగి రావాలనుకుంటే ఇలాగే ఉంటుందని పరోక్షంగా జంపింగ్ జిలానీలకు గుణపాఠం చెబుతున్నారన్న మాట.