సముద్ర తీరాన కళ్లు చెదిరేలా రాజ్ మహల్.. లోపలికి వెళితే బాబోయ్ చూడటానికి రెండు కళ్ళు చాలవు..! హాలులోకి అడుగు పెట్టగానే అదుర్స్ అనేలా.. మీటింగ్ రూములోకి వెళ్తే మిరమిట్లు గొలిపేట్లుగా.. బాత్ రూమ్ చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యేలా.. ఇక డైనింగ్ హాల్, బెడ్ రూమ్ చూస్తే ఓరి బాబోయ్ ఇక మాటల్లో చెప్పలేం అంతే. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేసేయండి.
అసలు ఏంటీ రాజ్ మహల్..?
నిన్న తాడేపల్లి ప్యాలెస్.. ఇవాళ రుషికొండ రాజ్ మహల్..! ఇప్పుడివే మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయ్. ఎవరు నోట చూసినా.. ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. ఇవి రెండూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాడి సొంత పనులకు వాడుకునేందుకు కట్టుకున్నవే అన్నది టీడీపీ, జనసేన ప్రధాన ఆరోపణ. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రుషికొండపై మొత్తం 61 ఎకరాల రుషికొండ విస్తీర్ణంలో 9.8 ఎకరాల్లో ఏడు బ్లాక్లుగా ఈ భవనాలను నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణాల్లో రూ.కోట్ల విలువ చేసే గ్రానైట్, మార్బుల్ తో కట్టిన కడం ఇది. మొత్తం రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్యాలెస్‌లో 26 లక్షల రూపాయలు కేవలం బాత్ టబ్ కే వాడినట్లు తెలియచ్చింది. ఇక ఫర్నీచర్ తదితర వస్తువులు, పరికరాలు విదేశాల నుంచి తెప్పించినట్లుగా సమాచారం.
రచ్చ మొదలు..!
ఈ నిర్మాణాలపై ఎన్నెన్ని ఆరోపణలు వచ్చాయో.. కూటమి అధికారంలోకి రాగానే ఇక్కడే టీడీపీ జెండాలు ఎగరేయడం, ఇప్పుడు ఏకంగా లోపలికి వెళ్ళి చూడగా బాబోయ్ ఇదేం కట్టడం బాబోయ్ అని సందర్శించిన గంటా శ్రీనివాసరావు అండ్ కో బ్యాచ్ నివ్వెరపోయారు. ఇక మీడియా మీట్ చెప్పి వివరణ ఇవ్వడం, ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేయడంతో ఇక చూస్కోండి వైసీపీ Vs కూటమి పార్టీలుగా పరిస్థితులు నెలకొన్నాయి. సరిగ్గా ఇప్పుడే రుషికొండ కోట రహస్యం బట్టబయలైంది. మూడున్నరేళ్లుగా సామాన్య ప్రజల కన్ను కూడా పడకుండా ప్రజాసొమ్ముతో నిర్మించిన విలాస భవనాలకు సంబంధించిన దృశ్యాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.
ఇదెందయ్యా ఇది..!
ఇది మొదటినుంచీ అక్రమ నిర్మాణం అని నాడు ప్రతిపక్షాలు పెద్ద రాద్దాంతమే చేశాయి. ఇప్పటి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్, ఇతర పెద్దలు కొందరు కోట దాకా వెళ్ళారు కానీ లోపలికి వెళ్ళలేకపోయారు. ఐతే అసలు రహస్యం ఇప్పుడు బయట పడింది. ఐతే దీనిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు స్పందిస్తూ.. వైఎస్ జగన్ దార్శనికతకు అద్దం పట్టేలా ప్రభుత్వ భవనాలు అని చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక చంద్రబాబు 2014-19 కాలంలో తాత్కాలిక భవనాలతో వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని.. గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని.. జగన్ విశాఖలో ప్రపంచం మెచ్చేలా అందమైన ప్రభుత్వ భవనాలు కట్టి తన దార్శనికతని చూపుకున్నారని కౌంటర్ అటాక్ చేస్తోంది వైసీపీ.
ఎవరికి వారే..!
రుషికొండపై ప్రభుత్వ భవనాలే ఇంత అద్భుతంగా కట్టిస్తే.. వైజాగ్ రాజధానిగా ఇంకెంత అందంగా నిర్మించేవాడో గ్రాఫిక్స్ చెయ్యలేదు.. మాయ అనేది అంతకుమించి చెయ్యలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనికి టీడీపీ స్పందిస్తూ.. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేశారని.. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో చూడాలని వైసీపీకి దిమ్మతిరిగేలా టీడీపీ కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. రుషికొండలో కట్టింది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులే. 1995 నుంచి కూడా విశాఖపట్నం ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊదరగొడుతూనే ఉన్నారని.. ఇప్పటికి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారని ఒకింత విమర్శలు గుప్పిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. విశాఖ నగరానికి ఒక రాష్ట్రపతి వచ్చినా, ఒక ప్రధానమంత్రి వచ్చినా, ముఖ్యమంత్రులు, గవర్నర్ లు వచ్చినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించండి అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఇప్పుడిక కూటమి సర్కార్ ఈ భవనాలను ఏం చేస్తుందో చూడాలి మరి.