గవర్నమెంట్ ఆఫీసుల్లో పవన్ ఫొటో!
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్ర ఏమిటనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కింగ్ మేకర్, 100 శాతం స్ట్రైక్ రేట్ సంపాదించుకుని ప్రభుత్వ ఏర్పాటుకు కారకుడయ్యారు. కూటమి గెలవడం, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్.. పలువురు మంత్రులతో సర్కార్ కొలువుదీరింది. ఎన్నికల ప్రచారం మొదలుకుని శాఖల కేటాయింపు వరకూ ఎక్కడా జనసేనానికి ప్రాధాన్యత తగ్గకుండా చంద్రబాబు చూస్తున్నారు. కోరుకున్న శాఖలు పవన్‌కు ఇవ్వడంతో పాటు.. జనసేన మంత్రులకు కూడా కీలక శాఖలే కట్టబెట్టారు బాబు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. తాజాగా సేనానికి అరుదైన గౌరవం లభించింది. దీంతో జనసైనికులు, మెగాభిమానులు, కార్యకర్తలు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
ఆచి తూచి!
గత ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి సర్కార్‌లో దొర్లకుండా ప్రతిదీ ఆచితూచి మరీ చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అందుకే తొలుత కూటమి గెలుపునకు ప్రధాన కారణమైన పవన్‌కు ఎక్కడా ప్రాధాన్యత తగ్గించుకుండా వస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఇవ్వడం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు శాఖలు అంటే ఆషామాషీ విషయం కాదు. ఈ పరిణామం తర్వాత చంద్రబాబు ఎవరూ ఊహించని రీతిలో నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం ఫొటో కూడా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆనవాయితీ ప్రకారం అయితే సీఎం ఫొటో మాత్రమే ఉంటుంది. అయితే.. ఈ ఏడాది నుంచి డిప్యూటీ సీఎం ఫొటో ఉండాల్సిందేనని ఐ అండ్ పీఆర్‌కు ఆదేశించడం జరిగింది. అంటే.. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు పక్కనే పవన్ కల్యాణ్ ఫొటో కూడా ఉంటుందన్న మాట. అంతేకాదు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఇరువురి ఫొటోలను వినియోగించాల్సిందేనని అధికారులకు క్లియర్ కట్‌గా ఆదేశాలివ్వడం జరిగింది.
ఆనందంలో మునిగి..!
సో.. ఇకపై ప్రోటోకాల్ ప్రకారం పవన్ ఫొటో ఉండి తీరాల్సిందే. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం.. ఇచ్చిన అరుదైన గౌరవంతో జనసేన శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇప్పటికే పాలన పరంగా ప్రక్షాళన ప్రారంభించిన విజనరీ లీడర్.. పవన్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలతో నిజంగా శభాష్ అనిపించుకుంటున్నారు. ఇంచుమించు తనతో సమానంగా హోదా ఇస్తుండటంతో అభిమానులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి కూటమి గెలవగానే ఇక తనదైన మార్క్, మారిన బాబును చూస్తారని పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మున్ముందు.. చంద్రబాబు ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.