అనితకే హోం శాఖ ఎందుకిచ్చినట్టు..?
హోం శాఖ.. ఎంత ప్రాధాన్యత ఉంటుందో..? ఎన్ని సవాళ్లు, అంతకుమించి ఇంకెన్ని ఇబ్బందులు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎక్కడ శాంతి భద్రతలు సమస్య తలెత్తినా.. ఏ చిన్నపాటి ఘటన జరిగినా చాలు హోం మంత్రిని దుమ్మెత్తి పోస్తుంటారు. ఈ శాఖను హ్యాండిల్ చేయాలంటే ఎన్నో గట్స్, అంతకు మించి సీనియార్టి, సిన్సియారిటి అన్నీ ఉండాలి. ఇదే శాఖ ఒక మహిళకు ఈ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది..? శాఖకు సరైన న్యాయం చేస్తారో.. లేదో..? అని ఒక్కటే సందేహాలు. ఐతే అబల ఐతేనేం మగవారికి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించిన సందర్భాలు ఒక్కసారి గతానికి వెళ్తే మనం చూడొచ్చు.
వైఎస్, జగన్ హయాంలో..!
ఒక మహిళ హోం మంత్రిగా ఎన్నో అద్భుతాలు సృష్టించిన సందర్భాలు కోకొల్లలు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో హోం శాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి సూపర్ అనిపించుకున్నారు. ఎంతలా అంటే నాడు పరిస్థితులు చాలా వేరు ఒకవైపు నక్సలైట్లు, మరోవైపు తెలంగాణ ఉద్యమం హడావుడి అయినా సరే.. ఏపీ నుంచి కాకుండా తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సబితా తనదైన మార్క్ పాలన చేసి చూపించారు. ఇక వైసీపీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక తన తండ్రినే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఫాలో అయ్యారు. కాకపోతే కులం, మతం, ప్రాంతం అనేది లేకుండా.. ఎస్సీ మహిళకు ఇవ్వడంతో పెద్ద సంచలనమే అయ్యింది. తొలిసారి మేకతోటి సుచరిత, ఆ తర్వాత తానేటి వనితలకు హోం పదవి కట్టబెట్టారు జగన్. ఈ నిర్ణయంతో జనాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. నిజంగా ఇదొక ట్రెండ్.. మునుపెన్నడూ లేని విధంగా తానేంటో నిరూపించుకున్న మనిషి వైఎస్ జగన్.
నేడు బాబు హయాంలో..?
ఒకసారి కాదు రెండుసార్లు వైఎస్ జగన్.. హోం శాఖ మహిళకు, అందులోనూ ఎస్సీ మహిళకు ఇవ్వడం ఆశ్చర్యపోయారు. ఇంకో విషయం ఏంటంటే.. మంత్రివర్గ విస్తరణ చేశాక కూడా మళ్ళీ మహిళకే ఇవ్వడం జరిగింది. దీంతో కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా వైఎస్ఆర్, జగన్ రెడ్డిల ఫార్ములాను ఫాలో అయ్యారు. అందుకే.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేశారో లేదో ఇక శాఖల కేటాయింపులు చేశారు. ఇందులో హోం శాఖ వంగలపూడి అనితను వరించింది. ఇది నిజంగా పెద్ద సాహసమే అని చెప్పుకోవచ్చు. ఐతే ఈమెకు పదవి ఎలా వచ్చింది..? అసలు ఏం చూసి హోం శాఖ ఇచ్చారు..? అనేది పెద్ద ప్రశ్నార్థకమే.
ఇదిగో ఇందుకే..?
వాస్తవానికి తొలుత పవన్ కళ్యాణ్ హోం శాఖ తీసుకోవచ్చనే ప్రచారం పెద్ద ఎత్తునే జరిగింది. తనకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ కూడా అస్సలు లేదని ఎన్నోసార్లు చెప్పారు. ఐనా సరే ఆయన అభిమానులు మాత్రం ఇవ్వాల్సిందే.. తీసుకోవాల్సిందే అని గట్టిగానే పట్టుబట్టారు. ఇక టీడీపీ తరపున మహిళ, సీనియారిటీని బట్టి చూస్తే.. మిగిలి ఉన్న వన్ అండ్ ఓన్లీ వంగలపూడి అనిత. అందుకే ఈమె పేరును చంద్రబాబు ఖరారు చేశారు. దీనికి తోడు.. ఉన్న ముగ్గురిలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ముద్ర కూడా కలిసి వచ్చింది. అలాగే వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళ. లెక్కలేనన్ని కేసులు, అంతకుమించి కేసులు జగన్ ప్రభుత్వం పెట్టింది. ఐనా సరే.. ఎక్కడా తగ్గకుండా పోరాడిన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు అనిత. ఈమె కష్టాల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు మొదలుకుని నేతలు, సీనియర్లు.. అధినేత చంద్రబాబు వరకూ అందరూ ఉన్నారు.
అన్నీ అనితనే!!
వైసీపీ హయాంలో ఎన్నో ఇబ్బందులు అనిత ఎదుర్కొన్నప్పటికీ.. జగన్ ప్రభుత్వాన్ని ఆటాడుకొని, ముచ్చెమటలు పట్టించారు. ఇక అనిత తగ్గేలా లేదని ఆఖరికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం పెద్ద షాకయ్యే విషయం. ఎందుకంటే ఆమె ఎస్సీ.. ఐనా సరే ఇలాంటి కేసు పెట్టడం మేధావులు, రాజకీయ విశ్లేషకులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక కొన్ని సార్లు పోలీసు కేసులు పెట్టడానికి వెళ్తే తీవ్రంగా పోలీసులు అవమానించిన సందర్భాలు కోకొల్లలు. అప్పట్లోనే నన్ను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళతోనే సెల్యూట్ కొట్టించుకుంటానని శపథం చేసి వచ్చారు.. అన్నట్టుగానే ఐదంటే ఐదేళ్లలోనే అనుకున్నట్టే జరిగింది. నాడు తిట్టిపోసి, ఘోరంగా అవమానించిన వారితోనే ఇప్పుడు సెల్యూట్ తీసుకోబోతున్నారు అనిత. దీనికి తోడు దూకుడు స్వభావం, అన్నీ విషయాలు తెలిసిన, సమాజం పట్ల ఉన్న అవగాహన ఇలా ఎన్నెన్నో అంశాలు అనితకు కలిసి వచ్చాయని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఎంతో నమ్మకంతో చంద్రబాబు పదవి ఇస్తే.. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనిత.. తనకు ఇచ్చిన శాఖకు ఏ మాత్రం న్యాయం చేస్తారో చూడాలి మరి. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ వంగలపూడి అనిత..!