తెలంగాణలోనూ రెడ్ బుక్.. ట్రెండ్ సెట్టర్ లోకేష్!
రెడ్ బుక్.. ఈ పేరు ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినపడుతోంది. ఇందుకు కర్త, కర్మ, క్రియ ఓకే ఒక్కడు అతడే టీడీపీ యువనేత నారా లోకేష్. యువగళం పాదయాత్ర సమయంలో చినబాబు రాసిన బుక్ ఇదే. అసలేంటి ఈ రెడ్ బుక్..? ఇందులో ఏం ఉన్నాయ్..? ఏం రాశారు..? అని తెలుసుకోవాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అనుకున్నట్టే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఆ రెడ్ బుక్‌ను లోకేష్ ఏం చేయబోతున్నారు..? ఎప్పుడు ఓపెన్ చేస్తారు..? అందులో ఏముంది..? అని తెలుసుకోవాలని సొంత పార్టీ శ్రేణులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు వేచి చూస్తున్నారు.
ఇప్పుడు తెలంగాణలో..!
నారా లోకేష్.. రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా చినబాబు తనను ఇబ్బంది పెట్టిన పోలీసు అధికారులు మొదలుకుని వైసీపీ నేతలు, కార్యకర్తల పేర్లు అన్నీ రాసుకున్నారు. ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరిగింది..? ఇందుకు కారకులు ఎవరు..? ఏవిధంగా ఇబ్బంది పెట్టారు..? ఇలా పిన్ టూ పిన్ రెడ్ బుక్కులో రాశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఫైబర్ గ్రీడ్ స్కాం, అమరావతి ల్యాండ్ ఇలా చాలా అక్రమ కేసులు పెట్టి ఆఖరికి టీడీపీ అధినేత నారా చంద్రబాబును అరెస్ట్ చేసి 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతారని ప్రచారం జరిగింది... కానీ ముందస్తు బెయిల్ తీసుకోవడం, న్యాయ స్థానాల్లో పోరాటం చేయడంతో ఆయన్ను ప్రభుత్వం టచ్ చేయలేక పోయింది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రెడ్ బుక్ వ్యవహారం మళ్ళీ తెరపైకి రాగా.. తెలంగాణలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది.
ఇప్పుడు తెలంగాణలో..!
బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోట రెడ్ బుక్ మాట వచ్చింది. తాము కూడా ఇక్కడ రెడ్ బుక్‌లో అందరి పేర్లు రాస్తున్నామని.. అధికారంలోకి వచ్చిన నాడు పరేషాన్లో పడతారని చెప్పుకొచ్చారు. అంతేకాదు కౌశిక్ లీకులు కూడా ఇచ్చారు. రెడ్ బుక్ బుక్ మొదటి పేజీలో ఎక్కే తొలి పేరు మంత్రి జూపల్లి కృష్ణరావు అని కూడా చెప్పేసారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వాళ్లందరి అంతు చూస్తామని హెచ్చరించారు. రామగుండం ఫ్లై యాష్ తరలింపులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. చూశారుగా.. ఇదే తెలంగాణలో ఎర్ర బుక్కు కథ.. ఎంతైనా నారా లోకేష్ క్రేజ్, రేంజ్ అంటే ఏంటో తెలంగాణకు కూడా తెల్సింది అన్న మాట. రానున్న తెలంగాణ ఎన్నికలలో ఏం జరుగుతుందో చూడాలి మరి.