అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి అన్నట్లుగా ఉంది ఇప్పుడు కూటమి పార్టీలోని (టీడీపీ, జనసేన, బీజేపీ) సీనియర్లు పరిస్థితి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ అధినేత చంద్రబాబు తమకు మంత్రి పదవులు ఇస్తారని ఎన్నో ఆశలు అంతకు మించి నమ్మకం పెట్టుకున్న సీనియర్లకు చివరికి నిరాశే మిగిలింది. ఒకరా ఇద్దరా పదుల సంఖ్యలో పెద్దలు ఒకింత నొచ్చుకున్న పరిస్థితి. దీనికి తోడు వైసీపీ నుంచి వచ్చి గెలిచిన ఇద్దరికి మంత్రి పదవులు దక్కడంతో మరికొందరు సీనియర్లు రగిలిపోతున్నారు. మరీ ముఖ్యంగా తొలిసారి గెలిచిన వారికి పదవులు ఇవ్వడంతో మేం అంత తప్పు ఏం చేశాం.. ఇంత అన్యాయం చేయడానికి అంటూ నిట్టూరుస్తున్నారు.
ఎందుకు ఏమైంది..?
హ్యాట్రిక్ కొట్టినోళ్ళు.. 5 సార్లు గెలిచిన వాళ్ళు, ఊహించని మెజారిటీని సొంతం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇకఎమ్మెల్సీలుగా పదవుల్లో ఉన్నోళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. జనసేన, బీజేపీ నుంచి గెలిచిన వారిని కాసేపు పక్కనబెడితే.. టీడీపీ తరఫున గెలిచిన వారు పదుల సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఒకరిద్దరిని తప్పితే సీనియర్లను లెక్కలోకి తీసుకోలేదు. ముఖ్యంగా రాయలసీమ, గోదావరి జిల్లాల నుంచి పెద్దగా సీనియర్లను తీసుకోలేదు. అంతేకాదు పేరుగాంచిన కుటుంబాలను సైతం ఈసారి ఛాన్సే రాలేదు. దీంతో ఎందుకు ఇలా జరిగిందేంటి..? అని బాధ పడుతున్నారు.
అయ్యో ఇలా జరగిందేంటి?
సీనియర్లు అంటే టీడీపీలో గుర్తుకు వచ్చేది.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, బొండా ఉమామహేశ్వర రావు, గద్దె రామ్మోహన్, నందమూరి బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మి నారాయణ, జీవీ ఆంజనేయులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. దీంతో పాటు గత చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు కూడా పెద్దగా లేకపోవడం గమనార్హం. ఐతే ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థ సారథి ఇద్దరూ గెలిచి నిలిచారు. ఈ ఇద్దరికీ మంత్రి పదవులు దక్కడంతో వీళ్ళు నిజంగా అదృష్టవంతులు అని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. చూశారుగా ఇదీ సీనియర్ల లెక్క.. మరి వారంతా ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి మరి.