టీడీపీ దెబ్బ.. కేశినేని నాని గుడ్ బై!
కేశినేని నాని.. ఈ పేరు, ఈయన రేంజ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఐతే ఇదంతా టీడీపీలో ఉన్నంత వరకు మాత్రమే. ఏ క్షణాన ఐతే టీడీపీకి టాటా చెప్పి.. వైసీపీ కండువా కప్పుకున్నారో అప్పుడే బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఈయన ఇలా ఫ్యాన్ గూటికి రాగానే.. సొంత సోదరుడు కేశినేని చిన్నీని ఎంపీ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించడం జరిగింది. అప్పుడే అసలు సిసలైన సినిమా బెజవాడ నడిబొడ్డున మొదలైంది. అన్నకు అడుగడుగునా తమ్ముడు చెక్ పెడుతూ వచ్చారు. ఎంతలా నాని అస్సలు వద్దు.. చిన్నినే ముద్దు అన్నట్లుగా జనాల్లోకి గట్టిగానే వెళ్ళారు. దీనికి తోడు టీడీపీలో ఉన్నన్ని రోజులు పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడటం, అధినేత ఎదిరించడం ఇవన్నీ.. తల్లి పాలు తాగి.. సామెతగా విజయవాడ ప్రజల్లోకి తీసుకెళ్ళి అప్పటి వరకు హీరోగా ఉన్న నానీని జీరో చేసింది టీడీపీ.
అవమానం భరించలేక!!
ఇక టీడీపీ నుంచి చిన్ని.. వైసీపీ నుంచి నాని పోటీ చేశారు. బెజవాడ వేదికగా బ్రదర్స్ మధ్య బిగ్ ఫైట్ నడిచింది. ఐతే.. ఈ యుద్ధంలో అన్న అడ్రస్ లేకుండా వెళ్ళగా తొలిసారి, అదికూడా సొంత అన్నపైనే రికార్డు మెజారిటీ సాధించి ఇంటికి పరిమితం చేశారు చిన్ని. ఈ అవమానం భరించలేక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించారు నాని. అది కూడా రాజకీయ సన్యాసం స్వీకరించినట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేయడం గమనార్హం. రాజకీయ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు.. ఎంతో ఆలోచించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రెండు సార్లు విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపూర్వమైన గౌరవంగా భావిస్తున్నట్టు నాని తెలిపారు. గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సహజం.. ఒక్క ఓటమికే నాని ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
కట్టుబడి ఉంటా..!!
రాజకీయాలకు గుడ్ బై చెప్పాక కూడా తాను విజయవాడ అభివృద్ధి కోసం చేయగలిగింది చేస్తానాన్నారు. ఇప్పుడు గెలిచిన నేతలకు, వారు చేస్తున్న అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని కూడా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా.. రాజకీయ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కేశినేని ధన్యవాదాలు తెలిపారు. కాగా కేశినేని నాని నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్న పరిస్థితి. టీడీపీ దెబ్బ.. నాని అబ్బ అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక్కటే కామెంట్స్ వస్తున్నాయి. అంతే కాదు ఈ లోకంలో దురదృష్టవంతుడు అంటే కేశినేని నానీనే అని కూడా తిట్టి పోస్తున్న పరిస్థితి. ఎలాగంటే అదే టీడీపీలో ఉండుంటే కచ్చితంగా ఇవాళ కేంద్రమంత్రి అయ్యేవారేమో. దీన్ని బట్టి చూస్తే తన కుమార్తె కేశినేని శ్వేత పొలిటికల్ ఫ్యూచర్ కూడా ప్రశ్నార్థకమే అని చెప్పుకోవచ్చు. మున్ముందు ఏమైనా మనసు మార్చుకుంటారేమో చూడాలి.. మరీ ముఖ్యంగా వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి మరి.