పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్‌గా పని చేసిన వర్మ పోటీ చేద్దామనుకుంటే.. దానిని పొత్తులో భాగంగా జనసేన పవన్ కళ్యాణ్‌కి కేటాయించడంతో వర్మ కొద్దిగా గొడవ చేసినా చంద్రబాబు సర్దిచెప్పడంతో వర్మ పవన్ కళ్యాణ్‌కి గట్టిగా సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. పవన్ కళ్యాణ్ కూడా వర్మకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ వస్తున్నారు. అయితే టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడమనేది చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ఇష్టప్రకారం జరిగింది. కింద కేడర్‌లో చాలామందికి అది మింగుడు పడలేదు. కారణం చాలాచోట్ల పొత్తులో భాగంగా సీట్ల త్యాగాలు జరగడంతో కొంతమంది అసంతృప్తులు బయలుదేరారు. అందులో వర్మ అనుచరులు, అటు పవన్ జనసేన కార్యకర్తలు ఉన్నారు.
ఈమధ్యనే పవన్ కళ్యాణ్ గెలిచాక వర్మ కారుపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. రాళ్ళు విసిరి డ్యామేజ్ చేశారు. ఆ విషయంలో వర్మ కూడా జనసేననే బ్లేమ్ చేశారు. టీడీపీ నుంచి జనసేనకి వెళ్లిన వారి పని ఇదని మీడియా ముందు చెప్పారు. దానితో వర్మకి పవన్ గెలవడం ఇష్టం లేదు.. అందుకే ఆరోపిస్తున్నారు అని జనసైనికులు అంటే.. పవన్‌ని గెలిపించిన వర్మ పై జనసైనికుల దాడిని వర్మ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు ఖండించారు.
తాజాగా పిఠాపురంలో మరోసారి టీడీపీ vs జనసేన అన్నట్టుగా తయారైంది వ్యవహారం. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలోని అపర్ణ దేవి అమ్మవారు బాధ్యతల కొరకు జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవని బ్లూ మీడియా హైలెట్ చేసేసింది.
ఆలయ నిర్వహణ కమిటీ బాధ్యతలు మాకు కావాలంటే మాకు కావాలని టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవలు పడగా ఆ వీడియోస్‌ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంది. మరి పవన్ సొంత నియోజకవర్గంలో ఇలాంటి గొడవలు ఎక్కడికి దారి తీస్తాయో అని బ్లూ మీడియా అయితే గోతికాడ నక్కలా ఎదురు చూస్తుంది.