వైఎస్ జగన్.. షర్మిల ఒక్కటవుతారా! టైటిల్ చూడగానే ఇదేంటి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వైఎస్ షర్మిలా రెడ్డి కలవబోతున్నారా అని ఆశ్చర్యంగా ఉంది కదా..? అవును మీరు వింటున్నది నిజమే కావొచ్చన్నది ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. 11 అసెంబ్లీ, 04 పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన పరిస్థితి. జగన్ సొంత ఇలాకా కడప జిల్లాతో పాటు కంచుకోటలను సైతం కూటమి కుప్పకూల్చి పసుపు జెండా పాతింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు దక్కించుకున్న వైసీపీ ఇంత ఘోరంగా ఎలా ఓడిపోయిందనే దానిపై ఇప్పటి వరకూ తెలియని పరిస్థితి. దీంతో ఏం జరిగింది..? ఎక్కడ తేడా కొట్టిందన్న దానిపై వైఎస్ జగన్‌తో సహా.. సీనియర్లు తలలు పట్టుకుంటున్నారు.
నంబర్-2 కావాల్సిందే!
వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ప్రజా వేదికతో కూల్చివేతలు మొదలు పెట్టి రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆఖరికి అవినీతి మచ్చలేని నారా చంద్రబాబును అక్రమ కేసుల్లో ఇరికించి రాజమండ్రి సెంట్రల్ జైలులో 52 రోజులపాటు ఉంచారు. ఇక్కడ్నుంచే వైసీపీ అధినేత పతనం మొదలైందన్నది ఎన్నికల తర్వాత నడుస్తున్న చర్చ. ఓ వైపు జగన్‌పై లెక్కలేనన్ని పాత కేసులు.. అధికారంలో ఉండగా జరిగిన అవినీతిని తవ్వితే ఇంకెన్ని కేసులు నమోదవుతాయో అనే భయం వైసీపీని వెంటాడుతోంది. రేపొద్దున వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేసినా.. అక్రమాస్తుల కేసుల్లో బెయిల్ రద్దు చేసి పూర్తిగా జైలుకే పరిమితం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే.. నంబర్ 2 కోసం వెతుకులాట ప్రారంభించింది. ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉండేది సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే.
కాంగ్రెస్‌లో కష్టమే!
అన్నతో తలెత్తిన విబేధాలతో విడిపోయిన షర్మిల.. తెలంగాణలో వైఎస్సార్టీపీని స్థాపించడం ఒక్క ఎన్నికను కూడా ఎదుర్కోకుండానే కాంగ్రెస్‌లో విలీనం చేయడం.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకుని ఎన్నికలకు వెళ్లి.. సోదరుడికి రివర్స్ బాణమై గట్టిగానే గుచ్చుకున్నారు. ఎంతసేపూ వైసీపీ, జగన్, అవినాష్ రెడ్డిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న షర్మిల.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కనీస ప్రయత్నం చేయలేదన్నది గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నడుస్తున్న చర్చ. దీనికి తోడు అధ్యక్ష పదవి దక్కి పట్టుమని పది నెలలు కూడా కాకమునుపే లేనిపోని ఆరోపణలు వచ్చాయి. సొంత క్యాడర్, నేతలను లెక్కజేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కూడా అమ్ముకున్నారనే ఆరోపణలు సుంకర పద్మశ్రీ లాంటివారే చేశారంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో పార్టీ కోసం ఏదో చేయాలనే మూడ్, ఉత్సాహం మొత్తం షర్మిలకు పోయిందట. ఇక కాంగ్రెస్‌లో ఉండటం అనవసరమని ఫిక్స్ అయినట్లు సమాచారం. త్వరలోనే అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా చేయొచ్చని టాక్ నడుస్తోంది.
షర్మిల కలుస్తారా..?
ఇక ఎలాగో వైఎస్ జగన్ జైలుకెళ్తే పార్టీని చూసుకోవడానికి ఒకరు కావాలని షర్మిలతో జగన్ రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. ఇంతవరకూ పెండింగ్‌లో ఉన్న ఆస్తుల పంపకాలతో పాటు.. వైసీపీలో నంబర్-2గా ఉండే పదవి కూడా ఇస్తానని బంపరాఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇక విజయమ్మకు కూడా గౌరవ అధ్యక్షురాలు పదవిని తిరిగి ఇవ్వడానికి జగన్ సుముఖంగానే ఉన్నారట. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్లు, క్యాడర్ కూడా చెప్పడంతో జగన్ ఆలోచన చేసినట్లు సమాచారం. అయినా అన్న లేనప్పుడు పార్టీని నడపడం షర్మిలకు కొత్తేమీ కాదు.. ఇదివరకే జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఒంటి చేత్తో చెల్లి నడిపారు. ఇక పిలిచి పెద్దపీట వేస్తానంటే ఎవరు మాత్రం వద్దంటారు చెప్పండి.. మరి అన్నతో కలిసి పనిచేయడానికి చెల్లి ఒప్పుకుంటుందా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఏమో.. ఏదైనా జరగొచ్చు మరి.