అవును.. మీరు వింటున్నది నిజమే..! ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన ఇద్దరు యంగ్ ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు వరించనున్నాయి. ఎన్నికల ముందు ఎన్డీఏలోకి టీడీపీ, జనసేన చేరిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికల్లో ఏపీలో ఘన విజయం సాధించడంతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్-12న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి 07:15 గంటలకు ప్రమాణం చేస్తున్నారు. మోదీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు కూడా కేంద్ర మంత్రి పదవులు వరించనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
ఎవరా యంగర్స్!
కేంద్ర కేబినెట్‌లోకి టీడీపీ చేరబోతున్నట్లు నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటు అదిగో ఫలానా శాఖలు టీడీపీ డిమాండ్ చేసిందనే వార్తలు సైతం గుప్పుమన్నాయి. అయితే శనివారం సాయంత్రంతో ఏపీ నుంచి ఎవరెవరికి కేంద్ర మంత్రి పదవులు వరిస్తున్నాయన్న దానిపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్లు ఖరారు అయ్యాయి. ఇక అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలి ఉందని తెలియవచ్చింది. ఇందులో రామ్మోహన్‌కు కేబినెట్ హోదా, పెమ్మసానికి మాత్రం కేంద్ర సహాయక మంత్రి పదవి ఖరారైందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఏపీలో గెలిచిన బీజేపీ ఎంపీలు, తెలంగాణ బీజేపీ ఎంపీల్లో ఎవరెవరికి పదవి వస్తుందన్నది తెలియట్లేదు.
ఇదీ బ్యాగ్రౌండ్!
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి మొత్తం 16 మంది ఎంపీలుగా గెలవగా ఇందులో చాలా మంది తొలిసారి ఎన్నికల్లో నిలిచి గెలిచిన వారే. మరికొందరు చివరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీలోకి గెలిచిన వారు కూడా ఉన్నారు. ఇక రామ్మోహన్ నాయుడు విషయానికొస్తే.. 2014, 2019, 2024 వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. వాస్తవానికి శ్రీకాకుళం అంటే కింజరపు ఫ్యామిలీకి అడ్డా. ఈ యువనేతను సిక్కోలు సింగం అని అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. ఇక ఎన్నారై అయిన పెమ్మసాని ఎన్నికల ముందు వచ్చి గుంటూరు ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. అతి తక్కువ సమయంలోనే కేడర్, నేతలను కలుపుకుని వెళ్లిన పెమ్మసాని ఘన విజయం సాధించారు. అలా గెలిచారో లేదో ఇలా కేంద్ర మంత్రి పదవి వరిస్తోంది. నిజంగా లక్ అంటే ఈ యంగ్ లీడర్స్‌దే..! శాఖల విషయం త్వరలోనే తేలిపోనుంది.