వైఎస్సార్ కూతురు.. ఏపీలో కాంగ్రెస్‌ను ఏదోలా జాకీలేసి లేపుతుంది.. ఎంతో కొంత ఉద్దరిస్తుందని హైకమాండ్ ఎన్నో కలలు కన్నది..! అబ్బే ఆ కలలన్నీ ఎన్నికల ఫలితాలతో కల్లలు అయ్యాయి..! దీనికి తోడు క్యాడర్, నేతల్లో లేని సమన్వయం.. ఏకపక్ష నిర్ణయాలతో రచ్చ రచ్చగా మారింది. ఎంతలా అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల ఎలా పుట్టారబ్బా..? అని కాంగ్రెస్ నేతలు తిట్టిపోస్తున్న పరిస్థితి. ఇప్పుడీ పంచాయితీ గల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. అసలు తతంగం అంతా ఎందుకు.. రాజీనామా చేసేస్తే పోతుంది కదా అని యోచిస్తున్నట్లు తెలియవచ్చింది.
ఏం ఉద్ధరించింది..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పొడుస్తాం.. చించుతామని చెప్పిన షర్మిల తాను పోటీచేసిన కడప పార్లమెంట్ స్థానంలో డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. వైసీపీ తరఫున పోటీచేసిన వైఎస్ అవినాష్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టి గెలిచారు. మొత్తం 6,05,143 ఓట్లు పోలవ్వగా 62,695 ఓట్ల మెజార్టీతో గెలిచి నిలిచారు. ఇక టీడీపీ తరఫున పోటీచేసిన భూపేశ్ రెడ్డి 5,42,448 ఓట్లతో రెండో స్థానానికి పరిమితం అయ్యారు. ఇక షర్మిల అయితే డిపాజిట్‌తో కొట్లాడి 1,41,039 ఓట్లు దక్కించుకోవడం గమనార్హం. పోనీ.. నలుగురైదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పోటీ చేయించినా.. కీలక నేతలు బరిలోకి దిగినా ఏ ఒక్కరూ గెలవకపోగా అందరూ నోటాపైనే గెలిచిన పరిస్థితి.
షర్మిల పని అయిపోయినట్టేనా..?
ఇవన్నీ ఒక ఎత్తయితే కాంగ్రెస్ టికెట్లు అమ్ముకున్నారని షర్మిల అండ్ కో అరాచకాలు సైతం పెరిగిపోయాయని సుంకర పద్మ శ్రీ మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ఏపీలో షర్మిల టీమ్ అరాచకాలు పెరిగిపోయాయని.. వాళ్లకు ఇష్టం వచ్చిన వాళ్లకు సీట్లు ఇచ్చారని తిట్టిపోశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే షర్మిల వల్ల ఓటింగ్ శాతం మరింత తగ్గిందని కాంగ్రెస్ నేతలే చెప్పడం గమనార్హం. మొత్తానికి చూస్తే.. ఉన్నది పోగొట్టుకుని (వైఎస్సార్టీపీ) లేనిదానికోసం వెళ్లి (కాంగ్రెస్) షర్మిల ఎన్ని తిప్పలు పడుతున్నారో..! రేపొద్దున్న షర్మిలను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో మరి.