రామోజీరావు గారికి అశ్రు నివాళి - నందమూరి బాలకృష్ణ
తెలుగు పత్రికా రంగంలో మకుటం లేని మహారాజు గా వెలుగొందారు రామోజీ రావు. తెలుగులోనే కాదు దేశ పత్రికా రంగంలోనే ఓ కొత్త ఒరవడిని సృష్టించి భావితరాల పత్రికా ప్రతినిధులకు మార్గదర్శి గా నిలిచారు. తెలుగు నుడికారానికి ఒక కొత్త కళను తెచ్చారు. జర్నలిజానికి కొత్త సొబగును దిద్దారు. చిత్ర సీమలో అదే తీరున సాగి ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియో గా రామోజీ ఫిలిం సిటీని తెలుగు నేలపై నెలకొల్పారు. ఏది చేసినా తనదైన బాణీ కల్పిస్తూ సాగిన రామోజీరావు ఇక లేరు అన్న వార్త ఆవేదన కలిగిస్తోంది. మా తండ్రిగారు నందమూరి తారక రామారావు గారితో ఆయన అనుబంధం ప్రత్యేకమైనది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
జూనియర్ ఎన్టీఆర్:
శ్రీ రామోజీరావు గారు లాంటి దార్శనీకులు నూటికో కోటికో ఒకరు.
మీడియా సామ్రాజ్యాధినేత మరియూ భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది.
ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం.
నిన్ను చూడాలని చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేను.
ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.