నారా చంద్రబాబు అనే నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎప్పుడెప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారా..? అని తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఫలితాలు జూన్-04నే వస్తే ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని వేచి చూసిన పరిస్థితి. అయితే ఆ నిరీక్షణకు తెరపడింది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ప్రమాణ స్వీకార ముహూర్తం ఈసారి ఫిక్స్ అయ్యింది. జూన్-12న బుధవారం ఉదయం 11:27 గంటలకు నారా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు టీడీపీ అధికారిక ప్రకటన కూడా చేసింది.
సభావేదిక ఇక్కడే!
ఈ మహోత్తర కార్యక్రమానికి గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వేదిక కానుంది. మొదట మంగళగిరి ఎయిమ్స్ అనుకున్నప్పటికీ ఐటీ పార్క్ అనువుగా ఉంటుందని టీడీపీ పెద్దలు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికైతే ఐటీ పార్క్ వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న చంద్రబాబు ఆదేశాల మేరకు సభావేదిక సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు రాగానే సభాస్థలిని కూడా పరిశీలిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రమాణ స్వీకార స్థలాన్ని అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్, మంతెన సత్యనారాయణ రాజు, పెందుర్తి వెంకటేష్ దగ్గరుండి చూస్తున్నారు. కాగా.. చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, మరో 10 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని సమాచారం.
ఎవరెవరు వస్తున్నారు..?
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోదీ, ఏన్డీఏ రాష్ట్రాల ముఖ్య నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విచ్చేయనున్నారు. కాగా.. జూన్-10న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోదీ కేబినెట్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు కూడా ఉండబోతున్నారు. మరీ ముఖ్యంగా ఏపీకి చెందిన టీడీపీ యువనేతలు ఇద్దరు, ముగ్గురు సీనియర్లు ఉంటారని సమాచారం. అక్కడ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఏపీలో చంద్రబాబు ప్రమాణం ఉండాలని ఇలా ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఎమ్మెల్సీలంతా విచ్చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన చంద్రబాబు వీరాభిమానులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.