ప్చ్.. ఇలా చేశావేంటి పవన్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ వినిపిస్తోంది. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని విజయం దక్కించుకున్న కూటమిలో పవన్ పాత్ర చాలా కీలకమైంది. ఎంతలా అంటే సేనాని లేకపోతే వైసీపీకి పోటీనే లేదని చెప్పుకునేంతలా..! ఇక.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురూ అవుతున్నాయి. కేబినెట్ కూర్పు పైన కూడా చర్చలు నడుస్తున్నాయి. ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన నరేంద్ర మోదీ.. చంద్రబాబు, పవన్‌లు భేటీ కావడం, సమావేశంలో మాట్లాడటం ఇవన్నీ చకచకా హస్తిన వేదికగా జరిగిపోతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ 10న ప్రధానిగా మోదీ ప్రమాణం ఉంటుంది. రెండ్రోజుల తర్వాత అనగా 12న ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇంతవరకూ అంతా ఓకేగానీ.. వాట్ నెక్స్ట్..? పవన్ పరిస్థితి ఏంటి..? అని జనసైనికులు, సేనాని సమాజిక వర్గం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇదీ అసలు సంగతి!
కూటమి గెలిస్తే తప్పకుండా పవన్ హోం మినిస్టర్ అవుతారని కార్యకర్తలు, అభిమానులు మొదలుకుని నేతల వరకూ అందరూ ఎన్నో కలలు కన్నారు. ఎందుకంటే.. సీఎం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన పదవి కావడంతో తప్పుకుండా ఇదే దక్కుతుందని, పైగా ఆయనకు కూడా ఇదే ఇంట్రస్ట్ అన్నట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే నాడు పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అని ఎంతలా హడావుడి చేశారో.. హోం మినిస్టర్ తాలుకా అంటూ అంతకుమించే రచ్చ చేశారు. ఇదే జరిగితే పవన్‌కు ఇక తిరిగే ఉండదు అన్నట్లుగా హడావుడి జరిగింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. దీంతో ఆయన ముందు జాతీయ మీడియా వాలిపోయి.. మీరు ఏ శాఖలు తీసుకుంటారు..? మీకు ఏ శాఖ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్..? అని ఇండియా టుడే ప్రతినిధి ప్రశ్నించగా.. ఆయన చెప్పిన సమాధానం విన్న జనసైనికులు, వీరాభిమానులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఈయనేంట్రా బాబూ.. ఇలా మాట్లాడేశారు..? ఊరించి.. ఊరించి ఉసూరుమనిపించారేంటి..? అని ఒకింత అసంతృప్తితోనే ఉన్నారు.
అబ్బే అస్సలు వద్దు!
హోం శాఖా తనకేమీ వద్దని.. వ్యవసాయ, పర్యావరణ శాఖలు అంటే ముద్దు అని ఒకే ఒక్కే మాటతో తేల్చేశారు. అంతేకాదండోయ్.. డిప్యూటీ సీఎం కూడా వద్దని చెప్పేయడం గమనార్హం. పవన్ కామెంట్స్ విన్న పార్టీ నేతలు, అభిమానులు ఒకింత నొచ్చుకున్నారట. వాస్తవానికి పవన్‌కు వ్యవసాయం, పర్యావరణం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇటు షూటింగ్.. అటు పాలిటిక్స్‌లో వీలు దొరికినప్పుడల్లా ఫామ్ హౌస్‌కు వెళ్లి ప్రశాంత వాతావరణంలో ఉండి వస్తుంటారు. ఇక రైతులకు పవన్ ఎంత సాయం చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అధికారంలో లేకపోయినప్పుడే పంటల ఎండిపోయి నష్టపోయిన, ఆత్మహత్య చేసుకున్న రైతన్న కుటుంబాలకు సినిమాలు, చారిటీ ద్వారా వచ్చిన డబ్బులు కోట్లల్లో సాయం చేశారు. తనకు ఆ శాఖ అనేది ఉంటే మరింత రైతాంగాన్ని అభివృద్ధి బాటలో నడిపించ వచ్చని బహుశా పవన్ అనుకుంటున్నారేమో. చూశారుగా.. పవన్‌కు ఏది ఇంట్రెస్ట్ అనేది ఇక పార్టీ నేతలతో సమాలోచనలు చేసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఏం జరుగుతుందో చూడాలి మరి.