జూనియర్ ఎన్టీఆర్.. కష్టాల్లో తోడుగా ఉంటానన్నాడు.. టీడీపీకి కష్టాలు రానే వచ్చాయ్ కానీ బుడ్డోడు మాత్రం రాలేదు..! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్లుగా ఎన్నో కష్టాలు.. కానీ ఎక్కడా కనిపించలేదు.. వినిపించలేదు..! 2024 ఎన్నికలు అయితే టీడీపీకి చావో రేవో అన్నట్లుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి.. అయినా సరే అడ్రస్ లేడు..! పోనీ కనీసం చిన్నపాటి ట్వీట్ అయినా చేశాడా అంటే అదీ లేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం దక్కించుకున్న రోజైనా సరే కనీసం అభినందిస్తారేమో నందమూరి ఫ్యాన్స్ కలల కన్నారు.. అవన్నీ కల్లలే అయ్యాయి..! సీన్ కట్ చేస్తే జూనియర్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కొందరు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. అంతేకాదు ఇక మీదట కూడా ఇలాగే ఎన్టీఆర్ ఉంటాడా..? అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు బుడ్డోడు వచ్చాడు అని మాట్లాడుకుంటున్నారు.
ఇదీ అసలు సంగతి!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి ఊహించని విజయం దక్కించుకుంది. ఎంతలా అంటే.. అధికార వైసీపీని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో కేవలం 11 అసెంబ్లీ, 04 లోక్‌సభ స్థానాలకే పరిమితం చేసిన పరిస్థితి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు.. రాజకీయ, సినీ ప్రముఖులు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాజీ ప్రధాని నరేంద్ర మోదీ, పురంధేశ్వరిలకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఏపీకి మళ్లీ మంచిరోజులు వచ్చాయని.. బాబు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని పూర్తి నమ్మకం ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. అయితే.. ఇంత భారీ విజయం దక్కినప్పటికీ నందమూరి ఫ్యామిలీ బిడ్డ, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నుంచి స్పందన రాకపోవడంతో తీవ్ర స్థాయిలోనే విమర్శలు వచ్చాయి. పార్టీకి చేసిందేమీ లేకపోగా కనీసం శుభాకాంక్షలు చెబితే సొమ్మేం పోతుందంటూ సొంత అభిమానుల నుంచి ఒకింత విమర్శలు వచ్చిన పరిస్థితి. దీంతో ఎట్టకేలకు స్పందించి నారా, నందమూరి ఫ్యామిలీ, పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంతకీ ఏమన్నారు..?
ప్రియమైన చంద్రబాబు మావయ్యకు ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్‌కు, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్, పురంధేశ్వరి అత్తకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్‌కు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ట్వీట్‌పై అభిమానులు, కార్యకర్తలు.. సినీ ప్రియులు పెద్ద ఎత్తున రిప్లయ్‌లు కూడా ఇస్తున్నారు. ఇంతవరకూ అంతా ఓకేగానీ.. ఒక్క ట్వీట్‌తోనే ఎన్టీఆర్ సరిపెడతారా..? ఇక ఎన్టీఆర్ యాక్టివ్‌గానే ఉంటారా..? లేదా..? అనేదానిపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే దీనిపై మిశ్రమ స్పందనే వస్తోంది. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ గానీ.. యాక్టివ్ కావాల్సిన అవసరం ఏముంది..? పరిస్థితిని బట్టి, మామ నుంచి వచ్చే పిలుపు వస్తే తప్పకుండా వస్తారని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఏం జరుగుతుందో.. రావాల్సిన టైమ్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.