2024 ఎన్నికలు మే 13 న ముగిసినా.. ఈ 15 రోజులుగా స్తబ్దుగా ఉన్న సర్వే సంస్థలు ఈరోజు దేశ వ్యాప్తంగా ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలను మొదలు పెట్టాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు మే 13 నే ముగిసాయి, కానీ కోడ్ అమలులో ఉన్నందున ఈరోజు వరకు ఏ సర్వే సంస్థ నోరు మెదపలేదు. కానీ ఈరోజు శనివారం సాయంత్రం 6.30 నుంచి ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ఛానల్స్, సోషల్ మీడియా పోటీ పడింది.
ముఖ్యంగా ఏపీలో ప్రజా తీర్పు పై విపరీతమైన చర్చ, ఆసక్తి నడుస్తుంది. ఈ ఎన్నికల్లో జగన్, చంద్రబాబు ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే విషయంలో విపరీతమైన బెట్టింగ్స్ నడుస్తున్నాయి.
ఇక కొన్ని సర్వేల్లో వైసీపీ లీడింగ్ లో ఉంటే.. మరికొన్ని అంటే అత్యధిక సర్వేలు కూటమి అధికారంలోకి రావడం పక్కా అని చూపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై పీపుల్స్ పల్స్ సంస్థ మే 16 నుంచి 20 వరకు పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో భాగంగా 6,900 శాంపిల్స్ సేకరించింది.
ఈ ఎన్నికల తర్వాత ప్రస్తుత సీఎం జగన్ ముఖ్యమంత్రి కావాలని 38 శాతం ప్రజలు కోరుకుంటే, చంద్రబాబు సీఎం కావాలని 40 శాతం మంది, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని 12 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు, ఏపీ అభివృద్ధికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రశ్నించగా, 52 శాతం మంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి, 41 శాతం మంది వైసీపీ అని చెప్పారు.
ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందని వ్యక్తిగత అభిప్రాయం కింద అడిగినప్పుడు 54 శాతం మంది కూటమి వైపు, 44 శాతం వైసీపీ వైపు నిలబడ్డారు అని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది.
ప్రధానమంత్రి ఎవరు కావాలని అడిగినప్పుడు నరేంద్రమోదీకి 48 శాతం, రాహుల్ గాంధీకి 38 శాతం మంది మద్దతు తెలిపినట్లుగా పీపుల్స్ పల్స్ సర్వే చెప్పింది.