ఆంధ్రప్రదేశ్ అసలు ఫలితాలు కంటే ఆరా ఫలితాల కోసమే రాష్ట్ర వేయి కళ్ళతో వేచి చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే.. ఆరా మస్తాన్ తెలుగుగడ్డపై తిరుగులేని సెఫాలజిస్ట్ అని రాజకీయ నేతలు, పార్టీలు చెప్పుకుంటూ ఉంటాయ్. ఏపీ ఫలితాలపై ఈయన సర్వే చేశారంటే చాలు.. అది మైండ్ బ్లోయింగ్ రిపోర్ట్ అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు 16 ఏళ్లగా తెలుగుగడ్డపై తిరుగులేని సెఫాలజిస్టుగా పేరుగాంచారు. సర్వేలు మొదలుకుని పార్టీ మారాలనుకునే టాప్ లీడర్ల వరకూ మస్తాన్ మాటే వేదవాక్కుఅని పొలిటికల్ లీడర్స్ చెబుతుంటారు. అందుకే ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయ్..? అనేది అందరూ అటు పక్కనబెట్టి.. ఆరా మస్తాన్ సర్వే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఏపీ ఓటర్లు ఎదురుచూస్తున్నారు.
ఎక్కడ చూసినా ఇదే!
ఆరా మస్తాన్ సర్వే ఎప్పుడొస్తుంది..? ఏ పార్టీ గెలుస్తుందని ఆయన చెప్పబోతున్నారు..? అని పోటీ చేసిన అభ్యర్థులు మొదలుకుని.. పార్టీల అధినేతలు ఆఖరికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సైతం ఎదురు చూస్తున్నారు అంటే ఆరా అంటే ఏంటి అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. 16 ఏళ్లుగా ఆరా సర్వేకు ఎదురెలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈయన ఓ వెలుగు వెలిగారని విశ్లేషకులు చెప్పుకుంటూ ఉంటారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలంలో మద్దిరాల ఈయన స్వగ్రామం. లా చదివిన మస్తాన్ సెఫాలజిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే ఫలితాల కంటే ఎక్కువగా ఈయన్ను నమ్ముతున్నారు. లోకల్ మొదలుకుని నేషనల్ మీడియా ఛానెల్స్ వరకూ ఆరా కోసం ఎదురు చూస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఐతే ఆరా వైసీపీదే గెలుపని చెబుతుందని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు చెబుతుండగా.. ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడొక లెక్క కచ్చితంగా ఆరా సర్వే కూటమి గెలుస్తున్నట్లు చెప్పబోతున్నారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు.. కార్యకర్తలు చెబుతున్న పరిస్థితి.
రండి.. రిలీజ్ చేద్దాం!
ఇక ఆరా సర్వే ఎక్కడ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయంపై మస్తాన్ ఒక ప్రకటన కూడా ఇచ్చారు. జూన్ ఒకటిన అనగా శనివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు షేక్ మస్తాన్ (ఆరా మస్తాన్), ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం, మద్దిరాల గ్రామంలో ఏర్పాటు చేయనున్న మీడియా మీట్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ- 2024 ఎన్నికల ఫలితాల అంచనాలు విడుదల చేస్తారని ప్రకటన చేశారు. ఇప్పటికే ఏపీతో పాటు తెలంగాణలో చేసిన సర్వేలన్నీ అక్షరాలా నిజం అయ్యాయి. ఏపీలో ఐతే 2014, 2019లో ఆరా మస్తాన్ అంచనాలు నిజం కావడంతో మరింత విశ్వసనీయత పెరిగింది. ఇప్పటికే ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఒక్క మాటతో చెప్పేసిన మస్తాన్.. రేపు సాయంత్రం ఏం చెప్పబోతున్నారా అని బెట్టింగ్ రాయుళ్ళు ఐతే నరాలు తెగిపోయే రీతిలో వేచి చూస్తున్నారు. ఏం చెబుతారో.. గాలి ఎటువైపు ఉంది అనేది.. తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.