ఎగ్జిట్ పోల్స్ మాత్రమే.. ఎగ్జాక్ట్ కాదు.. కంగారు పడకండి!!
జూన్ ఒకటో తారీఖు రేపే.. అదేనబ్బా దేశ వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తర్వాత ఇచ్చే ఎగ్జిట్ పోల్స్. అర్థం కావట్లేదా.. ఫైనల్ పరీక్షలకు ముందు సెమీ ఫైనల్ లాగా, ఫైనల్ మ్యాచుకు ముందు సెమీ ఫైనల్ లాగా ఫలితాలు రాబోతున్నాయి. లోకల్ మీడియా మొదలుకుని జాతీయ మీడియా వరకూ.. పేరుగాంచిన సర్వే సంస్థలు సైతం శనివారం సాయంత్రం ఆరున్నర గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తున్నాయి. ఇన్నాళ్లు ఒకలెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా రేపు పరిస్థితి ఉండబోతోంది. అంటే.. ఇన్నిరోజులు అదిగో వచ్చేది ఆ పార్టీనే.. అబ్బే అది కాదు ఇదిగో ఈ పార్టీనే అని తెగ రచ్చ.. మీడియాలో చూసినా.. సోషల్ మీడియా ఓపెన్ చేసినా, ఇక ఏ ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకున్నా ఫలితాలపైనే నడిచింది.
తీర్పు ఎలా ఉంటుందో..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయా..? అని అభ్యర్థులు అంతకు మించి ఓటేసిన ఓటర్లు వేయి కళ్ళతో నాలుగో తారీఖు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నారు. ఇంకో మూడు రోజుల్లో నాలుగో తారీఖు రాబోతోంది కానీ.. అంతకు మించి జూన్ ఒకటిన ఎగ్జిట్ పోల్స్ వస్తుండటంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో నరాలు తెగిపోయే టెన్షన్ మొదలైంది. ఇక అధినేతల్లో అంటారా..? ఇక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బెట్టింగ్ రాయుళ్ళ గురుంచి అస్సలు ఇక మాట్లాడనక్కర్లేదు. ఇప్పటి వరకూ లక్షల కోట్లు ఐతే రేపటి నుంచి అంతకు డబుల్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదీ ఏపీలో పరిస్థితి. ఇక విదేశాలకు వెళ్లిన పార్టీల అధినేతలు ఒక్కోక్కరుగా ఏపీలో వాలిపోతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతికి వెళ్లి పోలింగ్ రోజున ఏం చేయాలి..? ఎలా వ్యవహరించాలి..? అనేదానిపై కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చునే వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం అర్ధరాత్రికి లండన్ నుంచి తాడేపల్లికి వస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఈ ఇద్దరికంటే ముందే రష్యా నుంచి హైదరాబాద్ వచ్చేశారు.
ఎగ్జిట్ మాత్రమే.. ఎగ్జాక్ట్ కాదు!
ఐతే రేపు ఎగ్జిట్ పోల్స్ మాత్రమే వస్తున్నాయ్. వీటితోనే ఏ పార్టీ గెలుస్తుంది అన్నది పూర్తిగా చెప్పడానికి లేదు. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ కానే కాదు. ఎందుకంటే గత అనుభవాలను బట్టి చూస్తే.. ఎగ్జిట్ పోల్స్ అక్షరాలా నిజం అయినవి ఉన్నాయ్.. అంతమించి అట్టర్ ఫ్లాప్ అయినవి కూడా ఉన్నాయ్. ఇవే ఫలితాలకు ప్రామాణికం అనుకుంటే మాత్రం పప్పులో కలిసినట్టే. రేపు మొత్తం పోల్స్ అన్నీ వైసీపీ గెలుస్తుంది అని వచ్చాయి అనుకోండి.. పలితాలు కూటమి గెలిచినట్టు రావచ్చు. అదే కూటమికి సపోర్టుగా వస్తే రేపొద్దున వైసీపీనే గెలిచి రెండోసారి అధికారంలోకి రావచ్చు. అందుకే ఎగ్జిట్ పోల్స్ కు ఎగ్జాక్ట్ ఫలితాలకు చాలానే తేడాలు ఉంటాయి సుమీ. ఇందుకు చక్కటి ఉదాహరణ లగడపాటి రాజగోపాల్. ఒక్కసారి 2019 ఎన్నికల తర్వాత ఈయన సర్వే అట్టర్ ఫ్లాప్ కావడంతో.. అడ్రెస్స్ లేకుండా పోయారు కూడా..! సో.. అసలు సిసలైన ఫలితాలు వచ్చేవరకూ.. అదే జూన్ నాలుగో తారీఖు వరకూ కాస్త ఓపికగా ఉంటే అప్పుడిక తెలిసిపోతుంది