ఏపీలో ఎన్నికలు పూర్తి అయ్యాయి.. ఇంకో ఆరు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. ఎవరు గెలుస్తారో.. ఎవరు ఘోర పరాజయం పాలవుతారో అని అభ్యర్థుల్లో నరాలు తెగే టెన్షన్ నెలకొంది. ఇక వైసీపీ, కూటమి పార్టీల పెద్దలు అయితే.. ఎవరి ధీమాలో వారున్నారు. జూన్ తొమ్మిదో తారీఖు వైజాగ్ వేదికగా ప్రమాణ స్వీకారం ఉంటుందని ముందే చెప్పి వైసీపీ నేతలు ఏర్పాట్లు చేసేస్తున్నారు. ఇక కూటమి పార్టీల్లో ఐతే.. నిన్న మొన్నటి వరకూ చలీ చప్పుడు లేకుండా ఉంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విదేశాల్లో ఉన్నారు. ఇవాళే ఇద్దరూ తిరిగొచ్చారు. అప్పుడెప్పుడో ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి కాశికి వెళ్లిన ఈ ఇద్దరూ తర్వాత విదేశాలకు వెళ్ళిపోయారు.
సారొచ్చారు.. ఇక మొదలు!!
నారా చంద్రబాబు బుధవారం ఉదయం అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగొచ్చారు. వచ్చీ రాగానే కౌంటింగ్ రోజున ఏం చేద్దాం..? ఎలా ముందుకు వెళ్దాం..? కౌంటింగ్ రోజున ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఇలా అన్ని విషయాలు పార్టీ ముఖ్య నేతలతో బాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి.. అమెరికా టూర్ విషయాలు కూడా పంచుకున్నారు. గురువారం రోజు హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లి టీడీపీ నేతలతో భేటీ కానున్నారు. ఇక.. పవన్ కళ్యాణ్ కూడా రష్యా నుంచి హైదరాబాద్ వచ్చిన పవన్ ఫాం హౌసులో సేదతీరుతున్నారు. ఇద్దరూ ఇప్పుడు విదేశాల నుంచి తిరిగి రావడంతో ఏం చేయబోతున్నారు.. అనే దానిపై చర్చ జరుగుతోంది.
ఏం చేద్దాం.. ముందుకు ఎలా..?
ఇక ఈ ఇద్దరూ ఏపీకి వచ్చి మే-31న భేటీ కాబోతున్నారు. ఫలితాలకు ముందు జరుగుతున్న సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడలోని టీడీపీ ఆఫీస్ లేదా.. మంగళగిరిలోని చంద్రబాబు నివాసంలో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వైసీపీని ఎదుర్కోవడానికి ఏం చేయాలి అనే దానిపై నిశితంగా చర్చించబోతున్నారు. అదే విధంగా టీడీపీకి, జనసేన, బీజేపీకి ఎన్ని సీట్లు రావొచ్చు..? ఏ జిల్లాలో ఎన్ని రావొచ్చు..? మొత్తంగా కూటమికి ఎన్ని సీట్లు రావొచ్చు..? సర్వేలు ఏం చెబుతున్నాయి..? అనే దానిపై నిశితంగా చర్చించబోతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
కూటమి అధికారంలోకి వస్తే..!
ఇక అసలు విషయానికి వస్తే.. కూటమి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఎవరు..? డిప్యూటీ సీఎం పదవి ఎవరికి ఇవ్వాలి..? కీలక శాఖలు అయిన హోమ్, ఆర్థిక.. ఐటి శాఖలు ఎవరికి ఇవ్వాలి అనే దానిపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. జనసేన, బీజేపీల నుంచి ఎంత మందిని కేబినెట్ లోకి తీసుకోవాలనే దానిపై నిశితంగా చర్చ జరగనుందని తెలుస్తోంది. ఇన్ని రోజులు సైలెంట్.. సైలెంట్ ఎందుకీ మౌన వ్రతం అని ఓ వర్గం చంద్రబాబు, పవన్ పై తెగ హడావుడి చేసింది. అందుకే మాటల్లో ఏముంది.. ఏమున్నా చేతల్లోనే చేసి చూపిస్తాం అని బాబు, పవన్ కలవబోతున్నారని టీడీపీ, జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కూటమి ఓడినా సరే.. కలిసికట్టుగానే వైసీపీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా చర్చించే ఛాన్స్ ఉంది. మొత్తానికి చూస్తే మే-31 అందరి చూపు ఈ భేటీపైనే ఉండబోతోందన్న మాట. కూటమి కలలు ఫలిస్తాయా..? వైసీపీ విజయం తద్యమా అన్నది జూన్ నాలుగో తేదీన తేలిపోనుంది.. లెట్స్ వెయిట్ అండ్ సీ..!