ఈరోజు మే 28 సీనియర్ ఎన్టీఆర్ జయంతి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇంకా కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకి వచ్చి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. పెద్దాయనని నందమూరి ఫ్యామిలీనే కాదు అన్నగారి అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా గుర్తు చేసుకుంటున్నారు
మెగాస్టార్ చిరు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ని గుర్తు చేసుకుంటూ.. ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా.. ఎన్టీఆర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫొటోను ఎక్స్ లో పోస్ట్ చేశారు. కొందరి కీర్తి అజరామరం.. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈరోజు గుర్తుచేసుకుంటున్నాను. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవమని భావిస్తున్నాను. తెలుగువారి ఈ చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేసారు.
ఎన్.టి.ఆర్ శైలి అజరామరం : పవన్ కళ్యాణ్
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ.. తెలుగు నుడికారానికి.. తెలుగు నేలకు.. తెలుగు జాతికి మరింత సొబగులు అద్దినవారిలో మనం ఎన్.టి.ఆర్.గా పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరని తెలుగువారు కించిత్ గర్వంగా చెప్పుకోవచ్చని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ ఆయనదైన శైలి అజరామరం. రెవెన్యూ వ్యవస్థలో ఎన్.టి.ఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు, రెండు రూపాయలకే పేదలకు బియ్యం వంటి పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన స్వర్గీయ ఎన్టీఆర్ కి నివాళులు అర్పిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.