ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగియగానే టీడీపీ అధినేత చంద్రబాబు మిన్నకుండిపోయారు. ఎన్నికల నోటిఫికేషన్ మొదలుకుని పోలింగ్ ముందురోజు వరకూ తెగ హడావుడి చేసిన బాబు.. పోలింగ్ రోజు కానీ, ఆ మరుసటి రోజు చలీచప్పుడు చేయలేదు. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా మీడియా ముందుకొచ్చి ఇదిగో ఇన్ని సీట్లతో గెలుస్తున్నామని కానీ.. లేదంటే గెలవబోతున్నామని చెప్పేవారు. కానీ ఈసారి ఎందుకు మీడియాతో మాట్లాడటం అటుంచితే.. కనీసం ఒక్క ట్వీట్ కానీ, వీడియో కానీ రిలీజ్ చేయలేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో లేకుండా అమెరికాకు వెళ్లడంతో ఇక చూస్కోండి.. దీన్నే సువర్ణావకాశంగా మలుచుకున్న వైసీపీ నేతలు, శ్రేణులు రచ్చ రచ్చజేశాయి. బాబోయ్.. ఒక్కో వైసీపీ నేత నోరు తెరిస్తే.. అది నోరా తాటిమట్టా అనే సందేహం వచ్చేలా మాట్లాడేశారు. ఇక నెట్టింట్లో అయితే వైసీపీ కార్యకర్తలు రాయకూడని మాటలు అనేశారు. సీన్ కట్ చేస్తే.. బాబు మౌనానికి అర్థమేంటో క్లియర్ కట్‌గా అర్థమైంది.
ఇదీ విజనరీ..!
విజనరీ నేతగా పేరుగాంచిన సీబీఎన్.. ఎప్పుడూ సైలెంట్‌గానే తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. ఇది అందరికీ తెలుసిన విషయమే. ఈ 2024 ఎన్నికల్లో కూడా పోలింగ్ తర్వాత ఎక్కడా మాట్లాడకపోవడానికి.. అమెరికా వెళ్లడం వెనుక పెద్ద వ్యూహమే ఉందట. ప్రజాభిప్రాయం ఎలా ఉందో తెలిసినప్పుడు ఓట్ల లెక్కింపు జరిగే వరకూ రాజకీయ పార్టీలు ఎవరెన్ని మాట్లాడుకుంటారో.. ఎన్ని మాటలు చెప్పి బుకాయిస్తారో మనందరూ చూస్తూనే ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఇలాగే హడావుడి చేసిన చంద్రబాబు.. బొక్కబోర్లా పడ్డారు. అందుకే ఈసారి అలాంటి జోస్యాలు, చిలకపలుకులు పలకలేదన్నది టీడీపీ ముఖ్యులు చెబుతున్న మాట. అందుకే ఇంత మౌనం పాటిస్తున్నారో తప్ప.. కూటమి ఓడిపోతుందన్న మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవని చెబుతున్నారు.
మరి ఎందుకిలా..?
ఎలాగో కూటమిదే అధికారమని ధీమాగా ఉన్న చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి..? ఎలా చేయాలి..? అని అమెరికా నుంచే అన్నీ చక్కబెడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. కేబినెట్‌లోకి ఎవర్ని తీసుకోవాలి..? సీఎంవో పేషీలోకి ఎవరెవర్ని తీసుకోవాలి..? ఏయే అధికారులను తీసుకుంటే మంచిది..? ముఖ్యంగా నారా లోకేష్‌ను టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలా వద్దా..? అని ఇలా చాలా విషయాలపై సీనియర్లతో చర్చించడం.. ఓ నోట్ రూపంలో లెక్కలేసుకునే పనిలో దృష్టి అంతా కేంద్రీకరించినట్లు టీడీపీ ముఖ్యులు చెబుతున్నారు. ఇందులో నిజానిజాలెంతో..? అసలు కూటమి గెలిచే పరిస్థితి ఉందా..? లేదా..? వైసీపీ గెలిస్తే పరిస్థితేంటి..? అన్నది తెలియాలంటే ఫలితాలు వచ్చేవరకూ.. ఆ తర్వాత వరకూ వేచి చూడక తప్పదు మరి.