Advertisement
Google Ads BL

కూటమికి ఓటమేనా.. చంద్రబాబు మౌనమేల?


తేడా కొడుతోందా.. చంద్రబాబు మౌనమేల?

Advertisement
CJ Advs

అవును.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని అటు టీడీపీ.. ఇటు వైసీపీ చావో రేవో అన్నట్లుగా తలపడ్డాయి. టీడీపీకి మోదీ చరిష్మా, పవన్ కళ్యాణ్ ఖలేజా గట్టిగానే కలిసి వస్తాయని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయని.. అందుకే మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వేయాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే రాష్ట్ర ప్రజలను కోరారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక అంతే ధీమాగా గెలుస్తున్నాం.. వైజాగ్ వేదికగా వైఎస్ జగన్ అనే నేను అని ప్రమాణ స్వీకారం ఉంటుందని కార్యకర్తలు మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు.. ఆఖరికి అధినేత కూడా బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. దీనికి తోడు పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ ఆనందంలో మునిగి తేలుతున్న పరిస్థితి.

అన్నింటా సూపర్బ్!

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఒక వైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్, నారా లోకేష్.. ఇంకోవైపు నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి.. నందమూరి బాలకృష్ణ ఎంతలా కష్టపడ్డారనేది అందరం చూశాం. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ విషయానికొస్తే నిజంగా టీడీపీ శక్తికి మించే చేసిందని చెప్పుకోవచ్చు. ఆఖరికి పోలింగ్ రోజున వైసీపీ అధికార దర్పం చూపిస్తే పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొన్న తీరుకు సలాం చేయాల్సిందే. ఇక అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన గొడవలను ధీటుగానే బదులు ఇచ్చింది. అదేదో అంటారే ముల్లును ముల్లుతోనే తీయాలి అనేలా వైసీపీ ఆయుధం చేపడితే.. తగ్గేదెలా అంటూ పెట్రోల్ బాంబులు, కత్తులు, కొడవళ్ళు, రాడ్లతోనే ఇచ్చి పడేశారు. 

మౌనం ఎందుకు..?

ఈ ఎన్నికలు డూ ఆర్ డై కావడంతో దేనికైనా సరే అన్నట్లు అన్నిటికీ టీడీపీ నేతలు, కార్యకర్తలు తెగించేశారు. పోలింగ్ వరకూ అంతా ఓకే గానీ.. వైసీపీలో ఉన్న ధీమా కూటమిలో ఎక్కడా కనిపించలేదు. టీడీపీలో ఒకరిద్దరు.. అది కూడా ఎక్కడా పోటీ చేయని వ్యక్తులు అదేనబ్బా ఆ బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య తప్ప పెద్ద తలకాయలు ఎవరూ మీడియా ముందుకు వచ్చి ఇదిగో గెలుస్తున్నామని.. ఇన్ని సీట్లు వస్తాయనీ చెప్పిన సందర్భాలు లేవు. ఎన్నికలు ఏవైనా సరే.. తప్పకుండా మీడియా ముందుకు వచ్చి ఇన్ని సీట్లతో అధికారంలోకి వస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పేవారు. కానీ ఈసారి ఎందుకో ఎక్కడా చలీ చప్పుడు చేయలేదు.. పోనీ ఆంధ్రాలో అయినా ఉన్నారా అంటే అదీ లేదు అమెరికా చెక్కేసారు.! ఎందుకు చంద్రబాబు మౌనంగా ఉన్నారు..? కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదా..? కనీసం 50 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదా..? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. చంద్రబాబుకు ఇవన్నీ తెలిసే బాబు మౌనం పాటిస్తున్నారు అన్నది కొందరు విమర్శకులు చెబుతున్న మాట. ఇక వైసీపీ వాళ్ళు అంటారా..? ఏం మాట్లాడుతారో..? ఎలాంటి మాటలు వస్తాయో చెప్పక్కర్లేదు. 

కనీసం స్పందన లేదేం?

దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఫలితాలు ఉంటాయని వైఎస్ జగన్ గట్టిగానే చెప్పారు. పనిలో పనిగా వైజాగ్ వేదికగా ప్రమాణ స్వీకారం కూడా చేస్తానని క్లియర్ కట్ గా చెప్పేసారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఐతే కూటమి శిబిరం నుంచి కనీసం ఇలాంటి స్పందన రాకపోవడంతో ఏదో తేడా కొడుతోందని కొందరు తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. దీనికి తోడు కుప్పంలో చంద్రబాబు ఘోర పరాజయం పాలవుతున్నారని వైసీపీ నాయకులు అస్తమానూ.. అధినేతను అవమానించేలా మాట్లాడినా ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీడియా ముందుకో లేదా కనీసం ట్విట్టర్ వేదికగా ఇదిగో ఇంత మెజారిటీతో గెలుస్తానని.. క్యాడర్ నిరుత్సాహ పడకుండా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ కూటమి గెలుపు సంగతి అటుంచితే.. కుప్పం విషయంలో అయినా స్పందించి ఉంటే బాగుండేదన్నది సొంత పార్టీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా చెబుతున్న.. నిట్టూరుస్తున్న పరిస్థితి.

వ్యూహాత్మకమేనా..!

వాస్తవానికి చంద్రబాబు మౌనం గురుంచి కొందరు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ నేతలు చెబుతున్న మాటలు వేరేగా ఉన్నాయి. ఆయన మౌనం ఒక భయంకరం.. ఆలోచన అంతకు మించి ఊహించని రీతిలో ఉంటుందని చెప్పుకుంటున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమిదే అధికారం.. అలాంటిది ఎవరో మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడితే స్పందించి తనను తానే ఎందుకు తక్కువ చేసుకోవాలి..? ప్రతిదానికీ రియాక్ట్ కావాల్సిన అవసరం ఏంటి..? సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నిటికీ ఒక్క దెబ్బతో ఇచ్చి పడేయచ్చు అని చంద్రబాబు అనుకొని ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. జూన్ నాలుగో తేదీన సాయంత్రం వైసీపీ విమర్శకులకు, ఆరోపణలకు.. ప్రతి మాటకు కౌంటర్ కచ్చితంగా ఉంటుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అప్పుడో అయిపోలేదు కదా.. రెండు మూడు రోజుల్లోనే అమెరికా నుంచి బాస్ వస్తున్నారు.. మీడియా ముందుకు తప్పకుండా వస్తారు.. అప్పుడిక అసలు సిసలైన సినిమా ఉంటుందని టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. ఏదేమైనా బాబు మౌనం.. కూటమి ఓటమికి సంకేతమా..? లేకుంటే వ్యూహాత్మకమేనా..? అన్నది జూన్ నాలుగో తేదీన మధ్యాహ్నం సమయానికి తెలిసిపోనుంది. ఏం జరుగుతుందో.. ఏపీ ఓటరు ఎవర్ని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తున్నారో.. ఈవీఎంలు ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. అప్పటి వరకు వేచి చూడక.. ఎవరేం చెప్పినా వినక తప్పదేమో..!

Is it a defeat for the alliance? :

Is it a defeat for the alliance? Chandrababu silence?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs