పవన్ కళ్యాణ్.. జనసేనకు సపోర్ట్ చెయ్యమని సినిమా ఇండస్ట్రీలోని ఎవ్వరిని అడగలేదు. ఆఖరికి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కూడా జనసేనకు సపోర్ట్ చెయ్యమని కానీ, ఆయన్ని జనసేన తరపున ప్రచారానికి రమ్మని కానీ పవన్ అడగలేదు. కానీ చాలామంది జబర్దస్త్ నటులు పవన్ కళ్యాణ్ పై అభిమానంతో పిఠాపురంలోనే కాదు, ఇంకా జనసేన అభ్యర్థులు నించున్న నియోజకవర్గాల్లో ప్రచారం చేసారు.
అసలు వాళ్ళ ప్రచారం పవన్ కి అక్కర్లేదు. కానీ కమెడియన్స్ చాలామంది పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం, గౌరవాలతోనే ప్రచారం చేసారు. అయితే 2019 సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కి ఏ ఒక్కరి అండ లేదు. అప్పటి జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ తప్ప. షకలక శంకర్ కి మెగా ఫ్యామిలీ అంటే ఎంత ఇదో చేప్పకర్లేదు. ఆ అభిమానంతోనే గత ఎన్నికల్లో శంకర్ జనసేన తరపున ప్రచారం చేసాడు. కానీ ఈ ఎన్నికల్లో షకలక శంకర్ కనిపించలేదు. అది అందరికి ఆశ్చర్యమే అయినా.. తాజాగా శంకర్ పవన్ జనసేనపై సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.
తను 2019 ఎన్నికల్లో సొంత డబ్బు ఖర్చుపెట్టుకుని జనసేన తరపున ప్రచారం చేశాను. కానీ ఆ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ కనీసం ఫోన్ కూడా చెయ్యలేదు. జనసేన కార్య్ర కర్తలకి, పవన్ ఫాన్స్ కి 3 లక్షలు సొంత డబ్బుతో అన్నం పెట్టించాను. నా భార్య ఆ విషయంలో నాతో మాట్లాడం మానేసింది. చేతిలో ఉన్న డబ్బంతా ఆవిరి అయిపోయింది. చివరికి మా ఫ్రెండ్ దగ్గర వెయ్యి రూపాయలు తీసుకుని డీజిల్ కొట్టించుకొని ఇంటికి వచ్చాను.
పార్టీ కోసం డబ్బులు ఖర్చు చేశానని మా ఆవిడ మాట్లాడలేదు. ఈ సమయంలో మా మామయ్య అడిగిన ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు, పవన్ కోసం ఇంత చేసావు,పవన్ వలన నీకు ఒరిగిందేమిటి, పవన్ కళ్యాణ్ పై ప్రేమతో ఇంత చేశావు, ఆయన కనీసం నీకు ఫోన్ చేశాడా, తిరిగి నీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడని మా మామయ్య ప్రశ్నించారు.. అప్పుడు నాకు కూడా అది నిజమే అనిపించింది అంటూ శంకర్ పవన్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.