అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమేనండోయ్..! ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా టీడీపీలో పరిస్థితి ఉంది. ఏపీలో ఎన్నికల ఫలితాలకు ఇంకో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుమతానే ధీమాలో కూటమి ఉంది. ఫలితాలు రావడమే ఆలస్యం.. ప్రమాణ స్వీకారమే అన్నట్లుగా టీడీపీ నేతలు తెగ హడావుడి చేస్తున్నారు. అంతే రీతిలో ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయాలి..? ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి..? అని లెక్కలేసుకునే పనిలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అంచనాలు వేస్తున్నారు. ఇంతవరకూ అంతా ఓకేగానీ.. ఇప్పుడు మీరు చదవబోయే విషయం వింతగా అంతకుమించి విచిత్రంగానే ఉంటుంది.
టీడీపీలో ఏం జరుగుతోంది..?
కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ అధినేత నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు.. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా కీలక పదవే ఉంటుంది.. అది డిప్యూటీ సీఎం అవ్వొచ్చు.. కాదు కూడదు అంటే చెరో రెండున్నరేళ్లు సీఎం పదవినీ పంచుకోవచ్చు. టీడీపీ నుంచి సీనియర్లకు.. జనసేన నుంచి గెలిచిన ఒకరిద్దరికీ, బీజేపీ నుంచి గెలిచిన వారికీ కేబినెట్‌లో చోటు ఉంటుంది. అయితే.. ఈసారి యువనేత నారా లోకేష్‌ను మాత్రం మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు అస్సలు లేవట. ఆయనకు మంత్రి పదవి అవసరమే లేదని టీడీపీ నేతలే పట్టుబడుతుండటం గమనార్హం. ఎందుకంటే.. ఉడుకు రక్తమైన లోకేష్‌కు టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే డిమాండ్ వస్తోంది. ఇక ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ నేత అచ్చెన్నాయుడికి కీలక పదవి ఇవ్వాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదండోయ్.. లోకేష్‌కు పగ్గాలిస్తే తప్ప పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితులే లేవని సీనియర్ నేత బుద్ధా వెంకన్న లాంటి వారు కామెంట్స్ చేయడం గమనార్హం.
ఇదే ప్రకటన మే-13 ముందు..?
లోకేష్‌కు పదవి అనే ప్రకటన ఒకవేళ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఇచ్చి ఉంటే పరిస్థితేంటి..? అనేది ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలలో నడుస్తున్న చర్చ. అన్నీ అయ్యాక అదేనబ్బా.. ఎన్నికల ఫలితాలు వెలువడించాల్సిన తరుణంలో ఇలాంటి కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి. అదీ కూడా టీడీపీ ఇప్పుడు కాదు.. రానున్న 30 నుంచి 40 ఏళ్లపాటు ఏపీలో బతకాలంటే లోకేష్‌కు పగ్గాల్సిందేనని పదే పదే బుద్ధా వెంకన్న డిమాండ్ చేయడంతో.. కొందరు తెలుగు తమ్ముళ్లు నవ్వుకుంటూ ఉండగా.. మరికొందరు నవ్వు ఆపుకుంటున్నారట. ఇక పనిలో పనిగా.. చంద్రబాబు ఆత్మకథలో తనకంటూ ఒక పేజీ ఉంటుందని.. బాబు పాదాలకు రక్తంతో అభిషేకం చేసిన చరిత్ర లేదని అపని తాను మాత్రమేనని బుద్ధా గుర్తు చేశారు. బుద్ధా డిమాండ్ చేసినా.. విజ్ఞప్తి చేసినా తప్పేమీ లేదు కానీ.. ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది..? ఒకవేళ పగ్గాలు ఇచ్చాక పరిస్థితేంటన్నది తెలియాల్సి ఉంది