ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో అందరికీ తెలిసిందే. అలా ఎన్నికలు ముగిశాయో లేదు.. ఇటు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే పెద్ద తలకాయలపై లెక్కలేసి మరీ రాజకీయ విశ్లేషకులు, నెటిజన్లు చెప్పగా.. తాజాగా జనసేన నుంచి పోటీ చేసిన ఏకైక మహిళా అభ్యర్థి లోకం మాధవి వంతు వచ్చింది. అసలు ఈమె గెలిచే అవకాశాలు ఎంత..? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
ఎవరీ మాధవి..?
ఏపీలోని కీలక నియోజకవర్గాలలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల ఒకటి. ఇక్కడి నుంచే లోకం మాధవి పోటీ చేశారు. అమెరికాలోని కెంట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుకున్న మాధవి.. భర్తతో కలిసి మిరకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. సుమారు రూ. 900 కోట్ల ఆస్తులతో ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న సంపన్న అభ్యర్థులలో ఒకరిగా వార్తలకెక్కారు. భోగాపురం దగ్గర విద్యా సంస్థలు కూడా ఉన్నాయ్. గత ఎన్నికల్లో కూడా జనసేన అభ్యర్థిగా పోటీచేసి ఓడిన మాధవి.. వైసీపీ పాలించిన ఈ ఐదేళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొత్తులో భాగంగా కూటమి నుంచి ఈసారి కూడా ఈమె పోటీ చేశారు. ఇక ఈ నియోజకవర్గంలో ఎక్కువగా బీసీ సామాజికవర్గానికి చెందిన తూర్పుకాపులున్నారు. ఐతే మాధవి బ్రాహ్మీణ సామాజిక వర్గం కావడంతో మైనస్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.
ప్రత్యర్థి హ్యాట్రిక్ కొడతారా..?
ఇక నెల్లిమర్ల నుంచి ఈ ఎన్నికలలో వైసీపీ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు పోటీ చేశారు. ఈయన ఇప్పటి వరకు కాంగ్రెస్ తరపున 2009 లో గెలిచి 2014లో ఓడి.. ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో 28,051 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పుడు మాధవి.. ఈయనకు ప్రత్యర్ధి. రాజకీయాలు ఆమెకు కొత్త కావడం.. కూటమి పార్టీ నేతలు టీడీపీ, బీజేపీ నుంచి మాధవికి పెద్దగా సపోర్టు లేదని వన్ అండ్ ఓన్లీగా ఫైట్ చేశారు. ఇక నాయుడుకి రాజకీయ అనుభవం, రెండు సార్లు గెలిచి రికార్డు ఉంది.. దీంతో ఈసారి గెలిచి మంత్రిని కూడా అవుతానని ధీమాగా ఉన్నారు. మరి మాధవిని గెలిపించి అసెంబ్లీకి పంపుతున్నారో.. మళ్ళీ నాయుడినే గెలిపించి మంత్రిని చేశారో తెలియాలంటే జూన్ నాలుగో తారీఖు వరకూ వేచి చూడాల్సిందే మరి.