అవును.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు ఇంకా టైముంది కానీ ఈ లోపే జరగకూడని చిత్ర విచిత్రాలన్నీ చోటుచేసుకుంటున్నాయ్..! ఈ ఎన్నికల్లో పోటీచేసిన పలువురు నేతలు, అభ్యర్థులు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మధ్యనే తిరుపతి నుంచి జనసేన తరఫున పోటీచేసిన ఆరణి శ్రీనివాసులు.. మంత్రి, వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో రహస్యంగా భేటీ అయ్యారన్న వార్త ఒక్కసారిగా కూటమిని కుదిపేసింది. ఈ వ్యవహారానికి ఇంకా ఫుల్‌స్టాప్ పడకముందే మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. ఇది వైసీపీకి కూడా గట్టి ఝలక్ ఇచ్చే అంశమే అనుకోవచ్చు. ఇంతకీ ఏమైంది..? అసలు వంగా గీత ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
ఇదీ అసలు సంగతి..!
పిఠాపురం.. ఏపీలో ఇది కీలక నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీచేయడంతో పిఠాపురంకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గల్లీ నుంచి గల్ఫ్ వరకూ ఈ నియోజకవర్గంపైనే చర్చ జరిగిన.. జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే.. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీచేసిన పవన్.. ఈసారైనా గెలుస్తారా లేదా అన్నదే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. పవన్‌పై పోటీచేసిన వంగా గీత కూడా సామాన్యురాలేం కాదు రాజకీయంగా అనుభవజ్ఞురాలు, సీనియార్టీ.. సర్పంచ్ మొదలుకుని లోక్‌సభ వరకూ అన్నీ చూసొచ్చిన మహిళ. అందుకే ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అంతుచిక్కని పరిస్థితి. ఇక అదలా ఉంచితే.. జూన్-04న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. రిజల్స్ట్‌కు ముందే గీత చేతులెత్తేశారన్నది ఇప్పుడు నెట్టింట్లో నడుస్తున్న చర్చ. అంతకుమించి వైసీపీ.. జనసేన, మెగా ఫ్యాన్స్ మధ్య నడుస్తున్న ప్రధాన రచ్చ కూడా!
సడన్‌గా ఏమైంది..?
వంగా గీత గెలుపు కోసం వైసీపీ విశ్వప్రయత్నాలే చేసింది. పిఠాపురం ఓటర్లు కూడా దాదాపు గీతనే గెలిపించే ఛాన్స్ ఉందని సర్వేలు కూడా తేల్చేశాయ్. అయితే లక్ష మెజార్టీతో పవన్ గెలుస్తారని జనసైనికులు చెప్పుకుంటున్నారు. ఇలా నడుస్తుండగానే.. ఓ ప్రముఖ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా మెగా కుటుంబం అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు. వాస్తవానికి తాను ఎప్పుడూ చిరు గురించీ.. పవన్‌పై ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. అంతేకాదు.. పవన్ గురించి నియోజకవర్గంలో ఎవరైనా తప్పుగా మాట్లాడిన అస్సలు ఒప్పుకోనని తేల్చిచెప్పేసింది. అన్నయ్య చిరు అంటే ఎంతో అభిమానం, గౌరవమని.. ఆ ఫ్యామిలీకి కూడా తన గురించి బాగా తెలుసన్నారు. నాగబాబు అయినా తనకు గౌరవమని.. ఎన్నికల సమయంలో తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్న విషయాన్ని పదే పదే గుర్తు చేశారామె.
ఎందుకిలా..?
ఇంతవరకూ అంతా బాగానే ఉందిగానీ.. గీత కామెంట్స్‌తో కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ప్రత్యర్థిని పొగడ్తలతో ముంచెత్తడమేంటి..? అది కూడా ఎన్నికల తర్వాత.. ఫలితాలకు ముందు ఇలా మాట్లాడటం ఏంటనేది ఎవరికీ అర్థం కాని విషయం. కొంపదీసి రిజల్స్ట్‌కు ముందే ఓడిపోతానని తెలిసి చేతులెత్తేశారా..? లేకుంటే ఇదంతా వ్యూహాత్మకమా..? అనేది తెలియట్లేదు. మరీ ముఖ్యంగా.. రేపొద్దున్న ఫలితాలు తేడా కొడితే సేఫ్ జోన్‌గా కూటమిలోకి లేదా జనసేనలోకి జంప్ అవ్వడానికి ప్రీ ప్లాన్‌గా ఉన్నారా..? అని నెట్టింట్లో గట్టిగానే చర్చించుకుంటున్నారు. గీతను గెలిపిస్తే.. డిప్యూటీ సీఎం చేస్తానని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి పదే పదే చెప్పినా ఆమె మాత్రం ఇలా యూటర్న్ తీసుకోవడాన్ని ఆ పార్టీ శ్రేణులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. గీత మనసులో ఏముందో తెలియట్లేదు కానీ.. ఒక్కసారిగా ఇంటర్వ్యూలో ఈమె చేసిన వ్యాఖ్యలు మాత్రం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయి..? గీత పరిస్థితేంటి..? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో జూన్-04న చూద్దాం మరి.