దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు!
2019కు మించి స్థానాల్లో గెలుపు : జగన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి ఊహించని ఫలితాలు ఉండబోతున్నాయని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వైసీపీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న ఐప్యాక్ టీంను అభినందించారు. విజయవాడ నగరంలోని బెంజి సర్కిల్ వద్ద ఉన్న ఐప్యాక్ ఆఫీసులో జగన్ ప్రత్యక్షం అయ్యారు. సుమారు అరగంటకు పైగా ఐప్యాక్ సభ్యులతో చర్చించారు. జగన్ రెడ్డితో పాటు మంత్రులు బొత్సా సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు.
గట్టిగా కొడుతున్నాం..!
ఈ సందర్భంగా ఐప్యాక్ సభ్యులతో పలు విషయాలు చర్చించ్చారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. ఫలితాలు చూసి దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందన్నారు. గతంలో 151 అసెంబ్లీ స్థానాలు.. 22 పార్లమెంట్ స్ధానాలు కూడా చాలా పెద్ద సంఖ్య అని జగన్ చెప్పుకొచ్చారు. ఈసారి 151 కంటే ఎక్కువ అసెంబ్లీ స్ధానాలు, 22 ఎంపీ స్ధానాలు కంటే ఎక్కువ సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చేసేదేమీ లేదని.. వర్క్ అంతా టీమే చేస్తోందన్నారు. అంటే ఈ మధ్య ఎక్కడ చూసినా జగన్ గెలుపుపై, ప్రభుత్వ పథకాలపై విషం చిమ్ముతూ.. అవాకులు చవాకులు పేలుతున్న పీకేకు ఒక్క మాటతో జగన్ గట్టిగా ఇచ్చి పడేశారు.
సూపర్ రిషి..!!
ఐప్యాక్ టీమ్ సభ్యులంతా ఏడాదిన్నరగా అద్భుతంగా పనిచేశారని.. టీమ్ కృషి వల్లే టార్గెట్ సాధించగలుగుతున్నామని జగన్ చెప్పారు. రిషీ (ఐప్యాక్ టీంలో పీకే తర్వాత నంబర్ 2) చేసి ఎఫర్ట్ కూడా చాలా గొప్పదన్నారు. చాలా మందికి ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తున్నారో తెలియడం లేదని.. పీకే కన్నా రిషీ టీం చాలా వర్తీ అని ఆకాశానికి ఎత్తేశారు. ఏపీ ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయనీ.. రేపు వచ్చే నెంబర్లు గతంలో ప్రశాంత్ సాధించిన వాటి కన్నా గొప్పగా వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల తర్వాత కూడా టీం సేవలు కొనసాగించాలని అధినేత సూచించారు. వైసీపీ కోసం ఐప్యాక్ టీమ్ 2029లోనూ పనిచేస్తుందని జగన్ స్పష్టం చేశారు. సమావేశం ముగించుకొని తాడేపల్లి నివాసానికి జగన్ బయల్దేరి వెళ్ళారు. చూశారుగా.. గెలుపు కాదు.. వచ్చే సీట్లపై వైసీపీ, వైఎస్ జగన్ ఎంత ధీమాగా ఉన్నారో.. జూన్ 4న ఏం తేలుతుంది..? ఎలాంటి ఫలితాలు వస్తాయి..? అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.