ఎమ్మెల్యేలతో పొంగులేటి.. ఉలిక్కిపడ్డ కాంగ్రెస్!
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పట్టుమని 10 నెలలు కూడా కాలేదు. మంత్రి పదవులు.. కార్పొరేషన్ చైర్మన్లు, ఇప్పటికే ఎంపీ టికెట్ల విషయంలో ఎంత హడావుడి జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆఖరికి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాటి నుంచి ఎమ్మెల్యేలను, మంత్రులను.. సీనియర్లను లెక్క చేయట్లేదు అన్నది ఒక ప్రధాన ఆరోపణ. ఇందుకు సీనియర్ నేత వి హనుమంతరావు సాక్షి. ఈ వ్యవహారం గల్లి నుంచి ఢిల్లీకి వెళ్ళేసరికి పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ఆ తర్వాత ఒకరిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయాల్సి వచ్చింది.
ఇందులో నిజమెంత..?
పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఈయన గురుంచి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగారు. ఏ రేంజికి అంటే ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉండాలన్నా.. ఊడిపోవాలన్నా అంతా ఈయన చేతిలోనే ఉంది. అదీ పొంగులేటి సత్తా. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం.. దీనికి తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎమ్మెల్యేలు ఈయన మాటే శాసనంగా భావిస్తూ ఉండటంతో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది. పైగా ఇప్పటి వరకూ ఏపీని ఏలిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి అత్యంత ఆప్తుడు కావడంతో ఎప్పుడో ఒకసారి ఇద్దరూ కలిసి కుట్ర చేసి.. గులాబి బాస్ కేసీఆర్ ను గద్దెను ఎక్కించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని నిన్న మొన్నటి వరకూ చిత్ర విచిత్రాలుగా చర్చలు జరిగాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ పొంగులేటి కూడా ఎప్పుడూ స్పంచించకపోవడంతో అనుమానం.. అనుమానంగానే ఉంది.
ఇదీ సంగతి..!
ఇంత హడావుడి.. అనుమానాల మధ్య తనకు కావలసిన ఎమ్మెల్యేలు.. ఇంకా ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో ఓకే విమానంలో కనిపిస్తే ఎవరికైనా అనుమానం రాదా..? తప్పకుండా వస్తుంది కదూ. ఇప్పుడిదే జరిగింది. పొంగులేటితో ఖమ్మం ఎమ్మెల్యేలు అంతా కేరళకు ప్రయాణమై వెళ్ళారు. హైదరాబాద్ నుంచి కొచ్చిన్‌కు బయలుదేరారు. ఇందులో ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఒకరు తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.. ఇంకొకరు హర్హవర్ధన్ రెడ్డి. వీరంతా పైకి వీడియోలో కనిపించిన వారే. ఇంకా ఎంతమంది ఉన్నారో.. అసలేంటి ఇది.. జరుగుతోంది..? రేవంత్ సర్కారుకు రివర్స్ అవుతున్నారా..? ఎన్నికలు అయ్యాయి.. కాస్త చిల్ అవ్వడానికి వెళ్తున్నారా..? ఇవన్నీ కాదు అయ్యప్ప సామీ దర్శనానికి ఏమైనా వెళ్తున్నారా అనేది తెలియట్లేదు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ ఉలిక్కిపడింది. మొత్తానికి చూస్తే తెలంగాణలో మాత్రం ఏదో గట్టిగానే తేడా కొడుతోంది మాత్రం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఫ్లైట్.. పొంగులేటి కథ ఏంటో తెలియాల్సి ఉంది మరి.