అవును.. వైసీపీ అభ్యర్థి గెలవకపోయినా పర్లేదు.. అక్కడ స్వతంత్ర అభ్యర్థి గెలవాల్సిందే..! ఎందుకంటే.. తమకు ఎలాగో గెలిచే ఛాన్స్ లేకపోవచ్చు కాబట్టి ఇండిపెండెంట్‌కు కాస్త బూస్ట్ ఇస్తే తమ ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి.. కూటమి తరఫున టీడీపీ నుంచి పోటీచేస్తున్న నేత ఓడించాలన్నదే ప్రధాన లక్ష్యం. అందుకే.. వైసీపీ ఈ నిర్ణయానికి వచ్చిందట. అవునా ఇదేంటబ్బా అని ఆశ్చర్యంగా ఉంది కదూ.. నిజమేనండోయ్.. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి..? వైసీపీ ఇంత పర్సనల్‌గా ఎందుకు తీసుకుందనే విషయాలు చూసేద్దాం రండి..!
ఇదీ అసలు సంగతి..!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం ఎంత కీలకమైనదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నో ట్విస్టులు, మరెన్నో రచ్చలు.. అంతకుమించి అలకల మధ్య వైసీపీ రెబల్‌గా పనిచేసిన రఘురామకృష్ణంరాజుకు టీడీపీ టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ్నుంచి పోటీచేయాలనుకున్న శివరామరాజుకు దీంతో హ్యాండిచ్చేసినట్లు అయ్యింది. పార్టీనే నమ్ముకున్న తనను నట్టేట ముంచుతానంటే ఎందుకు ఊరుకుంటానంటూ రెబల్‌గా మారారు. వైసీపీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అభిమానులు, అనుచరులు అస్సలు ఒప్పుకోలేదు. పైగా టికెట్ ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. దీంతో ఇక్కడ ప్రధాన పోటీ రఘురామ వర్సెస్ శివరామరాజు మధ్యే నడుస్తోంది. ఇక వైసీపీ తరఫున పోటీచేస్తున్న పీవీఎల్ నర్సింహారాజు మాత్రం తాను ఓడిపోయినా ఫర్లేదు కానీ.. తన ప్రత్యర్థి మాత్రం అస్సలు గెలవకూడదని ఫిక్స్ అయ్యారట.
కంచుకోటను కూల్చాలని..!
వాస్తవానికి ఉండి టీడీపీ కంచుకోట.. ఇక శివరామరాజు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన అలా నిలబడితే చాలు ఓట్లే పడిపోయే పరిస్థితి. అలాంటిది ఆయన్ను పక్కనెట్టి రఘురామకు టికెట్ ఇచ్చారు. రఘురామ వైసీపీకి బద్ధ శత్రువు కావడంతో ఇలాంటి వ్యక్తిని అసెంబ్లీ కాదు కదా గేటు కూడా తాకనివ్వకూడదని భావించి ఇండిపెండెంట్‌కు బాగా బూస్ట్ ఇస్తోందని టాక్. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 24 వేల మంది ఓటర్లు ఉండగా.. ఇందులో మహిళా ఓటర్లే ఎక్కువ. ఇక సామాజిక వర్గం పరంగా చూస్తే కాపులదే పైచేయి. వాస్తవానికి జగన్‌ను శివరామరాజు కలిసినప్పటికీ వైసీపీలో చేరకపోవడానికి పెద్ద ప్లానే ఉందట. పార్టీలో రాకపోయినా ఫర్లేదు.. రేపొద్దున్న కచ్చితంగా చేర్చుకుంటామని మాటిచ్చిన జగన్.. టీడీపీ ఓట్లు చీల్చి, రఘురామను ఓడించి వస్తే కీలక పదవే కట్టబెడతామని జగన్ హామీ ఇచ్చారని టాక్. అందుకే వైసీపీ కూడా నియోజకవర్గంలో బాగా ఆకాశానికి ఎత్తుతోందట. చూశారుగా.. తన ప్రత్యర్థి గెలవడానికి మరో ప్రత్యర్థితో వైసీపీ చేతులు కలిపిందన్న వార్తలు ఒకింత పార్టీ శ్రేణులను కలవరపరుస్తున్నాయ్. ఇందులో నిజానిజాలెంతో.. ఉండిని ఏలే ఛాన్స్ ప్రజలు ఎవరికిస్తారో వేచి చూడాల్సిందే మరి.