ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మునుపెన్నడూలేని చిత్రవిచిత్రాలే జరుగుతున్నాయ్. గెలుపు, ఓటముల సంగతి అటుంచితే అదేదో సామెత ఉంది కదా.. తిన్నింటి వాసాలు లెక్కెట్టే వాళ్ల లెక్కలేనంత తయారయ్యారు. పార్టీలో ఉన్నన్ని రోజులు ఉండటం ఏ మాత్రం తమకు అనుకూలంగా లేకపోతే బయటికెళ్లడం ఆ పార్టీ అధినేత, పార్టీపై బురద జల్లడంతో మొదలుపెట్టి విషం కక్కే వరకూ ఆఖరికి ప్రత్యర్థులను ఆకాశానికెత్తే పరిస్థితికి దిగజారిపోతున్నారు. బాబోయ్.. ఇంత కరుడుగట్టిన మోసాగాళ్లా మన పార్టీలో ఇన్నాళ్లు ఉన్నది అని అధినేతే ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఇక పార్టీ శ్రేణులు ఎలా ఆలోచిస్తాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక పాయింట్‌కు వచ్చేద్దాం రండి.. అదుగో హెడ్డింగ్‌లో చెప్పిన ఆ ఇద్దరు మరెవరో కాదండోయ్.. మహాసేన రాజేష్, కల్యాణ్ దిలీప్ సుంకర..!
అవును.. జగనే బెటర్!
మహాసేన రాజేష్ యూట్యూబ్ చానెల్ ప్రారంభించడం మొదలుకుని ఎన్నెన్ని పార్టీలు మారారు..? ఏ పార్టీ టికెట్ దక్కించుకుని చేజేతులారా పోగొట్టుకున్నారు..? ఏయే కారణాలతో ఇలా జరిగింది..? అనేది ఇక్కడ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదేమో. అయితే టికెట్ వచ్చినట్టే వచ్చి చేజారినప్పుడు ఇదంతా జగన్నాటకం.. జగన్ మోహన్ రెడ్డే దళితులను తొక్కేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇప్పుడు జగనే బెటర్ అని అంటున్న పరిస్థితి. పనిలో పనిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తన మద్దతు ఉపసంహరించుకుంటున్నా అని కూడా చెప్పేశారు. కులం, మతం పేరిట అమాయకులపై దాడిచేసేవారు ఎవరైనా సరే వారికి వ్యతిరేకంగా పోరాడాలని అంబేద్కర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జనసేన పోటీచేసే అన్ని స్థానాల్లో ఓడించి తీరుతామని.. పదవులు, రాజకీయాలు ముఖ్యం కాదన్నారు. ఇలా ఒకటా రెండా బాబోయ్ ఎన్నెన్ని మాటలో. ఒకప్పుడు కూటమికి ఎంతో సపోర్టుగా ఉన్న వ్యక్తి.. ఇప్పుడు అంత రివర్స్ అయ్యారు. రాజేష్‌కు.. పవన్, చంద్రబాబు అంటే ఇష్టమే అభిమానమే. రెండు పార్టీల కోసం పనిచేసిన వ్యక్తి కావడంతో టికెట్ దక్కింది. పదునైన మాటలతో జగన్‌ను విమర్శించడం, వాక్చాతుర్యం ఇవన్నీ ప్లస్ అయ్యాయి. ఇప్పుడు రివర్స్ కావడంతో సీన్ మొత్తం మారిపోయింది.
జగన్‌ను ఢీ కొట్టేదెవరు..?
జగన్‌ను ఢీ కొట్టాలంటే అబ్బే చంద్రబాబు, పవన్ వల్ల అస్సలు కాదంటే కాదు.. అవతలి వ్యక్తి కూడా జగన్ మోహన్ రెడ్డే అయ్యుండాలి. ఇంకా చెప్పాలంటే దేవుడే దిగిరావాల్సిందే.. ఇవీ జనసేన నేతగా ఇన్నాళ్లు ఉన్న.. లాయర్‌గా కొనసాగుతున్న కల్యాణ్ దిలీప్ సుంకర చెబుతున్న మాటలు. జనసేనకు ఈయన ఒక ఆస్తిగా.. మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడికి నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి. ఏం జరిగిందో ఏమో తెలియట్లేదు కానీ ఎంత సపోర్టివ్‌గా ఉన్నారో అంతకు వెయ్యి రెట్లు రివర్స్ అయ్యి పవన్, జనసేన.. చంద్రబాబు, టీడీపీ.. కూటమిపై దుమ్మెత్తి పోస్తున్నారు. రోజుకో యూ ట్యూబ్ వీడియో చేస్తూ మూడు పార్టీల కార్యకర్తలు.. నేతలు.. ప్రత్యేకించి మెగాభిమానులను తెగ రెచ్చగొడుతున్నారు కల్యాణ్. ఒకటా రెండా ఎన్ని మాటలు అంటున్నారో.. ఆ మాటలు ఎవరెవరికి గుండెల్లో గునపాలుగా గుచ్చుకుంటున్నాయో వారికే తెలియాలి. ఒకప్పుడు జగన్‌ను Law తో కొట్టిన.. మాటల తూటాలు పేల్చిన దిలీప్ ఇప్పుడు రివర్స్ అవ్వడంతో జనసేన అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. పొరపాటున ఎవరైనా బూతులు తిడుతూ కామెంట్స్ చేసినా.. మీడియా మీట్‌లు పెట్టినా సరే మళ్లీ వీడియో చేసి మరీ కౌంటర్ ఇస్తున్నారు కల్యాణ్. చూశారుగా ఈ ఇద్దరూ కూటమికి.. మరీ ముఖ్యంగా జనసేనకు ఎంత తలనొప్పిగా మారారో..! ఈ తలనొప్పికి కూటమి నేతలు మందులు వేస్తారో లేకుంటే తగ్గిపోతుందిలే లైట్ తీసుకుంటారో చూడాలి మరి.