ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఎన్నో రోజులు కాదు గంటలు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఇంకా మిగిలిన గ్రామాలు, ఊర్లు తిరిగే.. ప్రత్యర్థులను ఒప్పించి, మెప్పించి తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో ద్వితియ శ్రేణి నేతలు మొదలుకుని పార్టీల అధిపతుల వరకూ నిమగ్నమయ్యారు. ఇక పిఠాపురం విషయానికొస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను గెలిపించడానికి బుల్లి తెర, వెండి తెర నటీనటులు, కమెడియన్లు విశ్వప్రయత్నాలే చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ దాదాపు ఇప్పుడు పిఠాపురంలోనే తిష్ట వేసింది. ఇదిగో తమ వల్ల కొన్ని ఓట్లు వచ్చినా మంచిదే కదా.. అభిమాన నేత గెలుస్తారు కదా అనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నారు.
పవన్ తక్కువే..!
వాస్తవానికి పవన్ కూడా పిఠాపురంలో పెద్దగా ప్రచారం చేయట్లేదు. ఎందుకంటే.. ఓ వైపు టీడీపీ నేత వర్మ.. ఇంకోవైపు ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటీనటులకే పిఠాపురంను వదిలేసిన పవన్.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇక ఇండస్ట్రీ నుంచి ప్రచారానికి రాలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నానితో పాటు పలువురు హీరోలు సోషల్ మీడియా వేదికగా సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. వచ్చినా రాకున్నా పవన్‌తోనే అని డైరెక్టుగా చెప్పేశారన్న మాట. ఇక కొందరు నిర్మాతలు అయితే సేనాని కోసం ఏకంగా పాటలు పాడి మరీ వదలుతున్నారు. ఇలా ఓటర్లును చైతన్యపరుస్తూ పవన్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే ఇదే టాలీవుడ్ సేనానికి ప్లస్ అవుతుందా లేకుంటే మైనస్ అవుతుందా అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని విషయం. ఎందుకంటే.. ఇవాళ ప్రచారం చేసినోళ్లు రేపు కనిపించరు.. ఓటు వేయించుకున్న పవన్ కూడా హైదరాబాద్‌లో ఉంటారన్నది ఇప్పుడు పిఠాపురంలో నడుస్తున్న పెద్ద చర్చ.
ఒక్కరిని కొట్టడానికి..?
పిఠాపురంలో ఎన్నికలు జరుగుతున్నాయా.. లేకుంటే సినిమా షూటింగులు జరుగుతున్నాయా అని పెద్ద ఎత్తునే ట్రోలింగ్స్ సైతం నడుస్తున్నాయి. పైగా ఒక్క మహిళను ఓడించడానికి ఇంతమంది ఒక్కటవ్వాలా..? అనేది జనాల్లో మెదులుతున్న ప్రశ్న. అలాగని జనసేనకు ఆదరించే వారు లేరా అంటే కచ్చితంగా ఉన్నారు. లోకల్ ఫీలింగ్.. పిలిస్తే పలికే వ్యక్తి.. ఇప్పటి వరకూ ఎంతో అభివృద్ధి చేశారని మరో ఛాన్స్ ఇస్తే కచ్చితంగా ఇంకా ఏదో అద్భుతం చేసి చూపిస్తారన్నది ఒక వర్గం నుంచి వస్తున్న మాటలు. దీంతో పాటు వర్మ ఈ మధ్య ఎక్కడ మీటింగులు పెట్టినా నోరు జారుతున్నారో లేకుంటే మనసులో మాట బయటపెడుతున్నారో కానీ పవన్ కల్యాణ్‌కు ఓటేయొద్దనే మాటలు వినిపిస్తున్నాయి. దీంతో లోలోపల ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఫైనల్‌గా ఏం జరుగుతుందో చూడాలి మరి.