ఏమిటీ విష, అమృత ఘడియలు పవన్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూటు మార్చారు. ఎప్పుడూ ఒకేలాగా మాట్లాడితే ఏం వస్తుంది..? అని అనుకున్నారేమో కానీ ఈసారి మరింత ప్రాక్టీస్ చేసి లాజిక్, అదిరిపోయే.. అందరికీ అర్థం అయ్యేలా ప్రసంగం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ.. రాజమహేంద్రవరంలోని వేమగిరిలో ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన సందర్భంగా కార్యక్రమంలో పవన్ ప్రసంగం చేశారు. దీంతో ఇప్పుడు రాజమండ్రితో ఏపీలో పెద్ద చర్చే జరుగుతోంది.
పాదాభివందనం..!
కూటమి బహిరంగ సభకు విచ్చేసిన ప్రధాని మోదీని పవన్ శాలువాతో సన్మానించారు. అనంతరం ప్రధానికి పాదాభివందనం చేయగా.. అయ్యో అలా చేయవద్దని ప్రధాని సూచించారు. ఇక సభలో ప్రసంగం ప్రారంభించిన పవన్.. మోదీని ఆకాశానికి ఎత్తేశారు. అయోధ్యకు శ్రీరామచంద్రుడిని తీసుకొచ్చిన మహానుభావుడు మోదీ అని పవన్ కొనియాడారు. భారత శక్తిని ప్రపంచానికి మోదీ చాటి చెప్పారని.. దేశానికి అభివృద్ధితో పాటు గుండె ధైర్యం ఉండే నేత కావాలని పవన్ ఆకాంక్షించారు. మోదీ నాయకత్వంలో ఉన్న ఇండియా వైపు పదేళ్లుగా శత్రువులు చూడాలంటేనే భయపడుతున్నారని పవన్ అన్నారు. మోదీ గొంతెత్తితే దేశంలోని అణువణువూ స్పందిస్తోందని ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదీ సంగతి..!!
ఇక విష ఘడియలు.. అమృత ఘడియలు అని పవన్ కొత్తగా మాట్లాడారు. ఇలా ఎందుకు మాట్లాడాల్సి అనేదానికి పవన్ నిశితంగా వివరించారు. జగన్ ఐదేళ్ల పాలనలో అడుగడుగునా కుంభకోణాలే అని.. కనీసం కేంద్ర పథకాలను వైసీపీ తమ పథకాలుగా చెప్పుకున్నదని సేనాని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు జగన్, వైఎస్సార్ పేర్లు పెట్టుకోవడం దుర్మాగం అన్నారు. ఆఖరికి కేంద్రం ఇళ్లకు జగనన్న కాలనీలు అని పేరు పెట్టుకోవడానికి కూడా జగన్ వెనుకాడలేదని చెప్పారు. ఈ ఐదేళ్లలో.. ఐదు కోట్ల మందిని జగన్ హింసించారనీ సంచలన ఆరోపణలే చేశారు. అందుకే.. ఈ పరిస్థితుల్లో విష ఘడియల నుంచి అమృత ఘడియలకు తీసుకెళ్లాలని మోదీని కోరామని ప్రధాని సమక్షంలో పవన్ చెప్పారు. మోదీ ముందుండి.. ఏపీని నడిపించాలని సేనాని తెలిపారు. జగన్ అవినీతి పాలన అంతమొందించేందుకు మోదీతో కలిసి పనిచేస్తున్నామని క్లియర్ కట్టుగా పవన్ చెప్పేసారు. అంతే కాదు 135 పద్మశ్రీలు దక్షిణ భారతీయులకు ఇచ్చిన ఘనత మోదీది అని వెల్లడించారు. ఇక చివరిగా.. వైసీపీ అవినీతి కోటలను బద్దలు కొడుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. చూశారుగా పవన్ ఏ రేంజిలో.. అదీ కూడా మోదీ ముందు మాట్లాడారో దటీజ్ సేనాని.