వాస్తు మారిస్తే వైసీపీ గెలుస్తుందా..!?
టైటిల్ చూడగానే ఇదేంటబ్బా.. ఇంత విచిత్రంగా ఉందనుకుంటున్నారా..? అవునండోయ్.. వాస్తు మారిస్తే వైసీపీ గెలుస్తుందని ఎవరో చెప్పడం.. ఈయన పాటించేయడం అన్నీ చకచకా జరిగిపోయాయ్. ఇక గెలుపే ఆలస్యమట. ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసినా నడుస్తున్న చర్చ. ఇంతకీ ఏమిటీ వాస్తు పంచాయితీ ఏంటి..? అనే విషయాలు క్లియర్ కట్‌గా తెలుసుకుందాం వచ్చేయండి మరి..!
ఇదబ్బా అసలు కథ!
వైనాట్ 175.. ఎట్టి పరిస్థితుల్లో 175కు 175 గెలిచి తీరాల్సిందే.. ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట మొదట వినిపించే మాట ఇదే. అయితే ఈ మధ్య ఎందుకో జగన్‌లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లినట్లుంది. ఒక్క నవరత్నాలు అమలు తప్ప.. అభివృద్ధి అనేది ఏమీ లేదన్నది ప్రజల్లో ఎప్పట్నుంచో నడుస్తున్న చర్చ. ఈసారి మేనిఫెస్టోలో కూడా అవే కొనసాగింపు ఇస్తానని ప్రకటించడంతో జనం నుంచి మిశ్రమ స్పందన రావడంతో సీన్ మారిపోయిందని వైసీపీకి అర్థమైపోయిందట. ఇక కూటమి మేనిఫెస్టో రిలీజ్ చేశాక అసలుకే ఎసరొచ్చిందనేది ఇప్పుడు టాక్. దీంతో ఎందుకిలా జరుగుతోంది..? ఎన్నో చేసినా ఎందుకీ ఎదురుగాలి..? అని మదనపడిన జగన్.. తాడేపల్లి ప్యాలెస్‌కు వాస్తు దోషాలు ఉన్నాయని ఎవరో ఒకరు చెప్పారట. అబ్బా.. ఇదేనా ఇంత చేస్తోందని చకచకా మార్పులు, చేర్పులు చేయించేశారట.
మార్పు మంచికేనా..!
జగన్ ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న వాస్తు దోషాలను పండితులకు చూపించగా.. చాలానే లోపాలున్నాయని గుర్తించారట. ముఖ్యంగా ఇంటి చుట్టూ ఎత్తుగా ఉన్న ప్రహరీలా నిర్మించిన ఇనుప కట్టడాన్ని ఒకసైడ్ తొలగించాలని.. చెప్పారట. దీంతో రాత్రికి రాత్రే వెల్డర్లు, కార్మికులను పిలిపించడం ఓ మూలన ప్రహరీని తొలగించేయడం అన్నీ అయిపోయాయట. అంతేకాదు.. ఈ పనులన్నీ జగనే దగ్గరుండి మరీ చూసుకున్నారట. చీమ కూడా ప్యాలెస్‌లోకి దూరకుండా జగన్ తాడేపల్లిలో ఇంటిని నిర్మించుకున్నాడన్నది జగమెరిగిన సత్యమే. అయితే.. జరగాల్సిన మార్పు జరిగింది.. మార్పు మంచికే అవుతుందా లేకుంటే ఏమవుతుందో చూడాలి. కాగా.. ఈ మధ్యనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తెలంగాణ భవన్‌లో గేటు పోటు ఉందని మార్చేసిన సంగతి తెలిసిందే. వాస్తు ప్రకారమే అటు జగన్.. ఇటు కేసీఆర్ మార్చేశారు. మార్పు సరే విజయం వరిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది మరి.