Advertisement
Google Ads BL

డైరెక్టర్ ఆఫ్ ద డైరెక్టర్స్.. దాసరి


దర్శకరత్న దాసరి నారాయణరావు.. ఈ పేరు చెబితే ఇండస్ట్రీ గర్వపడుతుంది.. అదే సమయంలో ఓ పెద్ద దిక్కును కోల్పోయిన బాధను కూడా వ్యక్తపరుస్తుంది. ఇండస్ట్రీ పెద్దగా, చిన్న సినిమాలకు దిక్కుగా.. ఇలా ఒక్కటేమిటి.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సర్వంతానై.. సరిలేరు నాకెవ్వరు అని అనిపించుకున్న మహోన్నత వ్యక్తి దాసరి. సినిమా ఇండస్ట్రీలో దాసరి అనే మూడక్షరాలు ఒక బ్రాండ్ అంతే. దర్శకులకు ఓ నిఘంటువు. నటీనటులకు ఓ దిక్సూచి. చిన్న, పేద కార్మికులకు ఆయనే అండ దండ. ఆయన లేని లోటు పూడ్చలేనిది.. తీర్చలేనిది. అందుకే ఆయన మరణానంతరం ఇండస్ట్రీ‌ ఏ విధంగా విస్తరి అవుతుందో.. ప్రత్యక్షంగా ఎంతో మంది చూస్తున్నారు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని వారంతా గురువుగారు అంటూ.. రోజూ ఏదో ఒక సందర్భంలో తలుస్తున్నారంటే.. ఇండస్ట్రీపై, అలాగే ఇండస్ట్రీలో దాసరి మార్క్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మే 04 ఈ లెజెండ్ జయంతి. ఈ సందర్భంగా ఆయనని ఒకసారి స్మరించుకుందాం. 

Advertisement
CJ Advs

రికార్డులు కొట్టినా ఆయనే.. వాటిని బద్దలు కొట్టినా ఆయనే!

40 సంవత్సరాలకు పైగా సినీ ప్రస్థానం, 151కి పైగా చిత్రాలకు దర్శకత్వం, 54 సినిమాల నిర్మాణం, 250కి పైగా చిత్రాలకు సంభాషణలు, నటుడిగా, పాత్రికేయుడుగా, పబ్లిషర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, కేంద్రమంత్రిగా.. ఇలా ఒక్కటేమిటి.. ఆయనొక బహుముఖ ప్రజ్ఞాశాలి. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం ఉన్న అతి కొద్ది మంది దర్శకులలో ఒకరు. అన్నింటికీ మించి పేదలకు పెన్నిధి. ఇండస్ట్రీలో, ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా.. నేనున్నానంటూ భరోసా కల్పించిన ధీరోదాత్తుడు. అప్పట్లో ఏ హీరో పేరు చెప్పినా.. ది బెస్ట్ మూవీ దాసరి డైరెక్ట్ చేసిన చిత్రమే అంటే అస్సలు అతిశయోక్తి కానేకాదు. అలాంటి హిస్టరీ‌ని క్రియేట్ చేసిన ఘనాపాటి దాసరి. 1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన దాసరి.. అందం కోసం పందెం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కె. రాఘవ నిర్మించిన తాత-మనవడు చిత్రంతో దర్శకుడిగా మారి.. ఎన్నో అజరామర చిత్రాలను రూపొందించి.. వాటితో రికార్డులను క్రియేట్ చేసి.. మళ్లీ తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. 

హీరోలతో అద్భుతాలు సృష్టించారు

నా పేరు రికార్డులలో ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులుంటాయ్.. ఇది ఇటీవల వచ్చిన ఓ సినిమాలోని డైలాగ్. ఈ డైలాగ్ దాసరికి పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఆయన ఎంతో మంది హీరోలతో వర్క్ చేశారు. ఆయన వర్క్ చేసిన ప్రతి హీరోతో ఒక్కో అద్భుతాన్నే సృష్టించారు. ముఖ్యంగా ది లెజెండ్ నందమూరి తారక రామారావుతో ఆయన డైరెక్ట్ చేసిన బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు చిత్రాలు ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచి.. ఇప్పటికీ ఆ సినిమాల గురించి మాట్లాడుకుంటున్నామంటే.. హీరోల విషయంలో దాసరి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఒక్క ఎన్టీఆర్ మాత్రమే కాదు.. అక్కినేని నాగేశ్వరరావు‌తో చేసిన ప్రేమాభిషేకం, మేఘసందేశం.. శోభన్ బాబుతో బలిపీఠం, గోరింటాకు.. కృష్ణంరాజుతో కటకటాల రుద్రయ్య, తాండ్రపాపారాయుడు.. కృష్ణతో యుద్ధం, ప్రజానిధి, విశ్వనాథ నాయకుడు.. చిరంజీవితో లంకేశ్వరుడు (దాసరి 100వ చిత్రం), బాలకృష్ణతో పరమవీరచక్ర (దాసరి 150వ చిత్రం) వెంకటేష్‌తో బ్రహ్మపుత్రుడు, నాగార్జునతో మజ్ను.. ఇలా హీరోలకు తన చిత్రాలతో స్టార్‌డమ్ తెచ్చారు దాసరి. ఇవే కాదు.. ఆయన నారాయణమూర్తితో చేసిన చిత్రాలు, విజయశాంతితో చేసిన ఓసేయ్ రాములమ్మ ఎటువంటి రికార్డులు క్రియేట్ చేశాయో.. వారి కెరీర్‌కి ఎంతగా ఉపయోగపడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిల్లరకొట్టు చిట్టెమ్మ, అమ్మ రాజీనామా, కంటే కూతుర్నే కనాలి.. ఇలా ఒక్కటేమిటి.. ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాలను దాసరి అటెంప్ట్ చేసి.. అదిరిపోయే సక్సెస్‌ని లిఖించారు. మంచు మోహన్ బాబు అయితే నా తండ్రి తర్వాత తండ్రి అని ఇప్పటికీ చెప్పుకుంటారంటే.. ఆయన జీవితంలో దాసరి అనే మూడక్షరాల ప్రభావం, ప్రాధాన్యత ఏ పాటితో తెలుసుకోవచ్చు.

దాసరి తర్వాత ఎవరు?

ప్రస్తుతం ఇండస్ట్రీని వేధిస్తోన్న, ఆలోచించేలా చేస్తున్న ప్రశ్న ఏదంటే.. దాసరి తర్వాత ఎవరు?. ఈ ప్రశ్నకు సమాధానం కష్టమే. ఎందుకంటే.. సినిమాల రిలీజ్‌ల విషయంలో క్లాష్ వస్తే సరిచేయడానికి, సరిదిద్దడానికి ఇప్పుడున్న నిర్మాతలు తల బాదుకుంటున్నారు. మీటింగ్‌ల మీద మీటింగ్స్ పెట్టి.. తర్జన భర్జనలతో ఎలాగోలా మ్యానేజ్ చేస్తున్నారు. అదే దాసరి ఉన్నప్పుడు ఒకే ఒక్క మాట.. నువ్వు ఆగు.. నీ సినిమా తర్వాత రిలీజ్ చెయ్ అంటే ఆగాల్సిందే. ఆ పెద్దరికం ఇప్పుడు కరువైంది. మరీ ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో దాసరి చూపినట్లుగా ఇప్పుడెవరు చొరవ చూపలేకపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఉన్నారంటే.. నేను పెద్దరికం తీసుకోను.. ఇండస్ట్రీకి పెద్ద బిడ్డగా ఉంటానంటున్నారు తప్ప.. దాసరిలా దబాయించలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటనేది పక్కన పెడితే.. దాసరి తర్వాత చిరునే అని సగానికిపైగా ఇండస్ట్రీ నమ్ముతున్నా.. ఆ నమ్మకాన్ని చిరంజీవి ఇవ్వలేకపోతున్నారు. ఆ గొడవలు, ఆ తగాదాలు నేను తీర్చలేనంటున్నారంటే.. ఇండస్ట్రీని తను ఉన్నంత వరకు దాసరి ఎలా మ్యానేజ్ చేసుకొచ్చారో అర్థం చేసుకోవచ్చు. అందుకే దాసరి తర్వాత ఎవరు? అనే ప్రశ్న.. ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. 

దర్శకులకే దర్శకుడు

అవును.. దర్శకులకే దర్శకుడు దాసరి. ఒకవైపు ఆయన సినిమాలు చేస్తూనే.. తన శిష్యులకి సినిమా అవకాశాలు వచ్చేలా చేసి.. తర్వాత తరానికి దారిచూపిన బాటసారి దాసరి నారాయణరావు. ఈ ప్రయాణంలో ఒక్కోసారి తన శిష్యులతోనే పోటీ పడ్డారంటే.. గురువుగా దాసరికి అంతకంటే ఇంకేం కావాలి. తన చేతుల్లో పెరిగిన కొడుకు ప్రయోజకుడు అయితే తండ్రి ఎంత సంతోషపడతాడో.. అంతగా తన శిష్యుల విషయంలో దాసరి పొంగిపోయేవారు. కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు, కె. మురళీమోహన్ రావు, సురేష్ కృష్ణ, కే.యస్. రవికుమార్, ధవళ సత్యం.. ఇలా ఎందరో దాసరి శిష్యులుగా తమ సత్తా చాటారు. అందుకే అనేది దర్శకులకే దర్శకుడాయన అని. అలాంటి దర్శకుడి పుట్టినరోజుని దర్శకుల దినోత్సవంగా జరుపుకుంటూ.. తెలుగు సినిమా ఇండస్ట్రీ దాసరికి నివాళులు అర్పిస్తోంది. ఇదే దర్శకరత్నకు ఇచ్చే ట్రిబ్యూట్ అంటూ మే 4న ఇండస్ట్రీ దర్శకకులం దాసరి నామస్మరణతో నిండిపోతుంది. ఫైనల్‌గా ఒక్కటే మాట.. దాసరికి మరణమే లేదు, ఇలా జననం తప్ప. దర్శకరత్న దాసరి జయంతి సందర్భంగా ఆయనకు సినీజోష్ నివాళులు అర్పిస్తోంది.

Dasari Narayana Rao Birth Anniversary Special Article:

Director of the Directors Dasari Narayana Rao
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs