పోసానిపై వైసీపీ పెద్దలు సీరియస్!!
అసలే ఎన్నికలు.. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్.. ఏ మాత్రం నాలుక తడబడినా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది..! అందుకే పెద్ద పెద్దోళ్లు మీడియా ముందుకు రాకుండా తిన్నగా సోషల్ మీడియాలోనే.. వీడియోల రూపంలోనో తమ అభిప్రాయాలను చెప్పుకుంటున్న పరిస్థితి. ఇదిగో టాలీవుడ్ నటుడు, ఏపీఎఫ్ డీఎస్ చైర్మన్ పోసాని కృష్ణమురళీ ఉన్నారే.. మీడియా ముందుకు వచ్చి రచ్చ రచ్చచేసేశారు. ఏం మాట్లాడాలని మీడియా ముందుకొచ్చారో కానీ.. అసలు విషయం కాకుండా ఏదోదే చెప్పేసి.. వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అడ్డంగా బుక్ చేసేశారు. ఇంతకీ ఏమైందంటే.. జగన్ హత్యకు కుట్ర జరుగుతోంది.. జగన్‌ను చంపేస్తామని చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యానించారంటూ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగలేదు.. చంద్రబాబు మాట్లాడిన మాటలు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు వినపడలేదా..? అంటూ ప్రశ్నించారు కూడా..!
ఇరికించేశారుగా..!
ఎన్నికలు వచ్చినప్పుడల్లా జగన్‌కు ఏదో ఒకటి జరుగుతోంది.. అది పనిగట్టుకుని చేయించుకుంటున్నారా..? లేకుంటే నిజంగానే జరుగుతోందా అనేది దేవుడెరుగు.. ఈ మధ్యనే రాయి దాడి వ్యవహారం ఎంత హాట్ టాపిక్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ వ్యవహారం అలా సద్దుమణిగిందో లేదో.. ఏదో ఒకటి నడుస్తూనే ఉండాలని పోసాని మీడియా ముందుకొచ్చేశారు. ఇంకేముంది మామూలుగానే పోసాని మాట్లాడితే అదొక రచ్చ.. ఇక ఎన్నికల టైమ్‌లో మాట్లాడితే ఎట్లుంటదంటే పైన చెప్పినట్లు ఉంటుంది. ఇప్పుడు దేశంలో ఫేక్ వీడియోల వ్యవహారంపై పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది.. ఈ విషయాన్ని ప్రస్తావించిన పోసాని ఆ వీడియోలకు ఉన్నంత విలువ ప్రాణాలకు, అది కూడా ముఖ్యమంత్రి ప్రాణాలకు లేదా..? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. పోనీ.. పోసాని చెప్పినట్లుగా అంతా నిజమే అనుకుంటే.. శాంతి భద్రతలు ఏమైనట్లు..? జగన్‌కు ఇంటెలిజెన్సీ, ప్రత్యేక సిబ్బంది.. యావత్ పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నట్లు..? అనే ప్రశ్నలు ప్రభుత్వంపై వస్తున్నాయి. ఒకవేళ ఇదంతా ప్లానింగ్ జరుగుతోంది కాబట్టి ముందుగానే ఇలా లీకులు ఇస్తున్నారా..? అనే ప్రశ్నలు సైతం వస్తున్నాయ్.
మీకో దండం సామీ..!
పోసాని ప్రెస్‌మీట్ మొత్తం రచ్చ రచ్చ కావడం.. ఈయన వీడియోలను పార్టు పార్టులుగా కట్ చేసి టీడీపీ ఓ రేంజ్‌లో కౌంటర్లు ఇవ్వడంతో వైసీపీ పెద్దలు స్పందించాల్సి వచ్చిందట. సీఎంవో నుంచి ఓ పెద్దాయన.. ప్రభుత్వ సలహాదారుల్లో పేరుగాంచిన ఓ వ్యక్తి పోసానికి ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్లుగా సమాచారం. మహాప్రభో మీరు ఇకపై మీడియా ముందుకు రాకండి.. దయచేసి ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకోండని మెత్తగానే మాట్లాడుతూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారని భోగట్టా. దీంతో పోసాని కూడా ఒకింత నొచ్చుకున్నారట. అసలే శాంతి భద్రతల విషయంలో.. డీజీపీ, సీఎస్ వ్యవహారంతో రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్ కాక మీద ఉంది. ఇలాంటి సమయంలో పోసాని కామెంట్స్ చేయడంతో అసలుకే ఎసరొచ్చిపడుతుందని గ్రహించి.. ఆయనకు చెప్పాల్సింది క్లియర్ కట్‌గానే చెప్పేశారట. మరి ఇకపై అయినా పోసాని మీడియా దూరంగా ఉంటారా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. అసలు ఇందులో నిజానిజాలెంత అనేది తెలియాలంటే అటు వైసీపీ నుంచి లేదా ఇటు పోసాని నుంచి రియాక్షన్ వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.