ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య గొడవలు జరుగుతున్నాయా..? మూడు పార్టీల మధ్య సఖ్యత కొరవడిందా..? బీజేపీని కూటమిలో చేర్చుకుని టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద తప్పే చేశానని ఫీలవుతున్నారా..? ఈ విషయాలన్నీ మేనిఫెస్టో ప్రకటనతో క్లియర్ కట్‌గా తెలిసిపోయాయా..? అంటే అక్షరాలా నిజమేనని అర్థం చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఇందులో నిజానిజాలెంత..? సరిగ్గా మేనిఫెస్టో టైమ్‌లోనే ఎందుకిలా జరిగింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..!
ఇదీ అసలు సంగతి..!
నేడే ప్రకటన.. నేడే మేనిఫెస్టో అని పెద్ద పెద్ద ప్రకటనలే చేసింది కూటమి. మంగళవారం ఉదయం 11 గంటలకు మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని ప్రకటించిన కూటమి పార్టీలు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గంటల ఆలస్యంగా ప్రజాగళం మేనిఫెస్టో అంటూ విడుదల చేసింది. దీంతో మూడు పార్టీల మధ్య ఏదో జరిగిందని.. ఢిల్లీ నుంచి ఫోన్ కాల్స్ రావడంతోనే ఏదో మూడో కంటికి తెలియని రచ్చ నడిచిందని టాక్ నడుస్తోంది. ఇక మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు మాత్రమే ముద్రించారు కానీ.. కనీసం ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. అంతేకాదండోయ్.. కనీసం బీజేపీ గుర్తులు కూడా కనిపించకపోవడంతో ఏదో జరిగిందనేది మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కీలక నేత, జాతీయ స్థాయి నాయకుడు సిద్దార్థ్ సింగ్.. మేనిఫెస్టో కాపీని తీసుకోవడానికి ఇష్టపడలేదు. పార్టీ నేతలు ఆయనకు కాపీలు ఇవ్వబోయినా.. తీసుకోండి సార్ అని చంద్రబాబు, పవన్ ఇద్దరూ చెప్పినా అబ్బే వద్దంటే వద్దని చేతులు ఊపి మరీ చెప్పడంతో ఏం జరిగిందో మీ ఊహకే తెలియాలి మరి.
ఎందుకిలా..?
ఇక ఇదే మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీ బీజేపీకి చెందిన ముఖ్య నేతలు కానీ.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఒక్కరంటే ఒక్కరూ పాల్గొనకపోవడం చర్చకు దారితీసింది. కనీసం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. సీఎం రమేష్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లాంటి వారు కూడా కనీసం స్టేజీపైన కనిపించలేదు. ఇక స్టేజీపైన ఉన్న ఒకే ఒక్క సిద్ధార్థ్ సింగ్ హాజరైనా ఆయన ఎలా ప్రవర్తించారో క్లియర్ కట్‌గా వీడియోల్లో చూడొచ్చు. ఈ మొత్తమ్మీద చూస్తే.. కూటమి ముగ్గురిదే అయినప్పటికీ.. మేనిఫెస్టో మాత్రం ఇద్దరిదేనని చర్చ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే నడుస్తోంది. ఇది అస్సలు ఎన్డీఏ మేనిఫెస్టో కానే కాదని.. టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో అని కమలనాథులు గుసగుసలాడుకుంటున్నారట. ఇవన్నీ కాదు.. మేనిఫెస్టోకు, కూటమి గెలుపునకు బీజేపీ మద్దతు ఇస్తోందా..? లేదా..? అన్నది తెలియక టీడీపీ, జనసేన నేతలు, కేడర్ ఆందోళన చెందుతున్న పరిస్థితి. మరోవైపు.. అనవసరంగా బీజేపీని కూటమిలో చేర్చుకున్నామని చంద్రబాబు కూడా రిగ్రేట్ అవుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయట. మున్ముందు ఇంకా ఏమేం జరుగుతుందో.. ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో మరి.