ఏపీలో ఇప్పుడు పసుపు చుట్టూ రాజకీయం నడుస్తోంది. సొంత చెల్లి వైఎస్ షర్మిలపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పసుపు చీర అంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపుతున్నాయి. తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్లిన షర్మిల పసుపు చీరతో వెళ్ళారు. నారి నుంచి నేటి వరకూ పసుపు చీరే కాదు.. మాటలు, స్క్రిప్ట్ అంతా చంద్రబాబు చెప్పినట్లుగానే చదువుతోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మాటలు పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ వేసే ముందు వైసీపీ నిర్వహించిన వేలాది మంది ముందు మాట్లాడారు. దీనికి నొచ్చుకున్న షర్మిల అన్నకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.
ఏమనుకోవాలి జగన్!
వేలాది మంది మగవారు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లి అని చూడకుండా తాను ధరించిన దుస్తులు గురుంచి మాట్లాడటం దారుణమని షర్మిల చెప్పుకొచ్చారు. పచ్చ చీర కట్టుకుని చంద్రబాబుకు మోకరిల్లినట్లు జగన్ చెప్పడాన్ని ఏమనుకోవాలి..? అని షర్మిల ప్రశ్నించారు. చంద్రబాబు స్క్రిప్టు చదవాల్సిన అవసరం నాకేంటి..? అసలు పసుపు చీర కట్టుకుంటే తప్పేంటి..?పసుపు రంగుపై చంద్రబాబుకు ఏమైనా పేటెంట్ ఉందా.. ? సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌లో పైన పసుపు రంగు ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా షర్మిల గుర్తు చేశారు.
నాన్న చెప్పింది గుర్తు లేదా..?
సాక్షి పత్రిక, ఛానల్‌లో పసుపు రంగు ఉంటే తప్పేముంది అని నాడు వైఎస్ఆర్ చెప్పిన మాటలను గుర్తు చేసి మరీ కౌంటర్ ఇచ్చారు షర్మిల. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చీరలు గురించి మాట్లాడటం ఏంటి..? దుస్తుల గురించి మాట్లాడుతుంటే సభ్యత, సంస్కారం ఉందా? అని ప్రశ్నించారు షర్మిల. పనిలో పనిగా రాసిచ్చిన స్క్రిప్టును ఎవరు చదువుతారు అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చేశారు షర్మిల. జగన్ రెడ్డికి రాసిచ్చిన స్క్రిప్టును చదివే అలవాటు ఉంది కానీ తనకు లేదన్నారు. చంద్రబాబు దగ్గర మోకరిల్లే అవసరమా తనకేంటి..? జగన్ రెడ్డి బీజేపీ, మోడీ ముందు మోకరిల్లి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా స్వప్రయోజనాల కోసం చూసుకున్నారని షర్మిల చెప్పుకొచ్చారు. మళ్ళీ చెబుతున్న జగన్.. వైఎస్ఆర్ వారసుడు కాదని మోడీకే వారసుడు అని.. దత్తపుత్రుడు అని బీజేపీ నేతలే చెప్పిన విషయాన్ని మరీ మరీ గుర్తు చేశారు. మొత్తానికి చూస్తే.. ఇంత వరకూ షర్మిల ప్రస్తావన తీసుకురానీ జగన్ ఇలా ఎన్నికల ముందు చివరి నిమిషంలో ఇలా మాట్లాడి.. కౌంటర్లు ఇప్పించుకోవడం ఎంటో మరి. అంటే.. ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో అన్నట్లుగా జగన్ మాట్లాడటం.. షర్మిల కౌంటర్ ఇచ్చి.. ద్వజమెత్తడం సరిపోయింది.