రక్త సంబంధం.. ఒకరంటే ఒకరికి ప్రాణం.. అన్న కోసం అహర్నిశలు కష్టపడిన చెల్లి..! ఆఖరికి అన్న కోసం బాణమై ప్రత్యర్థులపై గురిపెట్టింది, పాదయాత్ర చేసింది కూడా..! అలాంటిది ఒక్కసారిగా రివర్స్ అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారబ్బా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి గురించేనండోయ్.! 2019 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైసీపీ.. షర్మిలకు కచ్చితంగా న్యాయం చేసి ఏదో ఒక పదవి కట్టబెడతారని పెద్ద చర్చే జరిగింది.. కానీ ఎందుకో అదేదీ జరగలేదు. సీన్ కట్ చేస్తే.. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేయడం.. పార్టీ పెట్టడం, విలీనం చేసేసి ఏపీకి తిరిగొచ్చేయడం ఇవన్నీ అతి తక్కువ కాలంలోనే జరిగిపోయాయి. ఇప్పుడు జగన్‌కు గుదిబండలాగా తయారయ్యింది షర్మిల. అసలు అన్న చెల్లి మధ్య గొడవలు ఎందుకొచ్చాయి..? ఈ గొడవలు రావడానికి కారణాలేంటనేది కాస్త నిశితంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది.
ఇదీ అసలు సంగతి!
అన్నా చెల్లి మధ్య విబేధాలకు ఆస్తి తగాదాలే కారణమని టాక్ నడిచినప్పటికీ.. నిన్న మొన్నటితో అదే అక్షరాలా నిజమని తేలిపోయింది. ఆస్తుల విషయంలో గొడవ జరిగి చిల్లిగవ్వ కూడా జగన్ ఇవ్వలేదన్నది అక్షర సత్యమైంది. కడప ఎంపీగా పోటీచేస్తున్న షర్మిల.. ఇటీవల ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పుల లెక్కలు క్లియర్ కట్‌గా రాసుకొచ్చారు. షర్మిల మొత్తం ఆస్తి రూ. 123, 26, 65,163 (కోట్లల్లో). షర్మిల భర్త అనిల్ పేరిట 45, 19, 72, 529.. ఇవే కాకుండా తన దగ్గర 3 కోట్ల 69 లక్షల 36 వేలు విలువ చేసే బంగారం కూడా ఉందని షర్మిల చెప్పారు. అంతేకాదు.. 4, 61,90, 688 రూపాయల విలువ చేసే జెమ్‌స్టోట్ జ్యువెల్లరీ కూడా ఉన్నట్టు కూడా అఫిడవిట్‌లో రాసుకొచ్చారు. ఇక వ్యవసాయ భూములు, ఇంటి స్థలాలు అన్నీ లెక్కలేసి మరీ చెప్పారు. 82,77,71,682 (కోట్లలో) రూపాయిలు వైఎస్ జగన్ రెడ్డికి షర్మిల అప్పు ఉందట. మరోవైపు భారతీకి కూడా 19,56,682 అప్పు ఉన్నారట షర్మిల.
తేడా కొట్టింది ఇక్కడేనా..!
ఆస్తుల పంపకాలు చేయాలని పదే పదే జగన్ రెడ్డిని షర్మిల అడగ్గా.. ముందు అప్పులు కడితే ఆ తర్వాతే ఆస్తుల సంగతని గట్టిగా తేల్చిచెప్పారట. దీంతో అప్పులు కట్టలేక.. షర్మిల ఆస్తులను వదులుకున్నట్లు తాజాగా నడుస్తున్న పరిస్థితిని బట్టి తెలుసుకోవచ్చు. ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో పరోక్షంగా షర్మిల కూడా చెప్పేశారు.!. ఇక భారతీ కూడా ఆస్తులు, అప్పుల విషయంలో కలుగజేసుకున్నారని కూడా టాక్ నడుస్తోంది. మరోవైపు.. ఆస్తుల విషయంలో అన్న కంటే ముందుగా వదిన భారతీనే రచ్చ చేశారని.. మాటా మాటా పెరగడంతో జగన్ రంగంలోకి దిగడంతో డివైడ్ అయ్యారనే చర్చ నడుస్తోంది. ఏదైతేనేం.. ఇన్నాళ్లు ఇద్దరి మధ్య నెలకొన్న విబేధాలకు కారణమేంటి అనేది ఒక్క అప్లికేషన్‌తో క్లియర్ కట్‌గా షర్మిల చెప్పేశారు. ఇందులో నిజానిజాలెంత అనేది అటు జగన్ నుంచి.. ఇటు షర్మిల నుంచి అధికారికంగా ఏదైనా ప్రకటన వస్తే గానీ క్లారిటీ వచ్చేలా లేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.