జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈనెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు. స్వయంగా సేనానీయే అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. నామినేషన్ అనంతరం నియోజకవర్గంలోని ఉప్పాడ భారీ బహిరంగ సభలో పవన్ పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన సత్యనారయణ వర్మ.. నామినేషన్ కార్యక్రమానికి వస్తారా లేదా అనేది తెలియట్లేదు. దీంతో జనసేనలో టెన్షన్ మొదలైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇండిపెండెంట్‌గా పోటీచేసేందుకు వర్మ రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలియవచ్చింది.
ఎందుకిలా.. ఏమైంది!
పిఠాపురం నుంచి పవన్ పోటీచేస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి నియోజకవర్గంలో పరిస్థితుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత కాసింత సద్దుమణగడం వర్మ-పవన్ ఒక్కటవ్వడంతో పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. తన గెలుపు బాధ్యతను వర్మ చేతిలో పెట్టారు పవన్. అయితే.. తనపై సేనాని పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండటానికి అహర్నిశలు కష్టపడుతున్న వర్మకు అడుగడుగునా టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇల్లు దాటి ప్రచారానికి వెళ్తే చాలు.. టీడీపీ కార్యకర్తలు ఆయన్ను అడ్డుకొని తిట్టిపోస్తున్న పరిస్థితి. ఒకానొక సందర్భంలో కార్యకర్తల నుంచి తప్పించుకుని వచ్చి కారెక్కిన పరిస్థితి. దీంతో ఇక వర్మ నుంచి పవన్‌కు సపోర్టు ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
వస్తారా.. రారా!
టీడీపీ కార్యకర్తల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రస్తుతానికి ఆయన ప్రచారానికి కూడా దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఒకవేళ ప్రచారానికి వెళ్లినా అంతంత మాత్రమే. ఇండిపెండెంట్‌గా పోటీ చేయండి.. మీకేం కొత్త కాదు కదా.. గెలిపించి అసెంబ్లీకి పంపుతామని అనుచరులు, ముఖ్య కార్యకర్తలు వర్మకు సూచించారట. అలాగైతే తమను ఓట్లు అడగాలని లేకుంటే అడగనక్కర్లేదని తెగేసి చెప్పేశారట. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఆలోచనలో పడ్డారట వర్మ. అయితే.. అనుచరులు, పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయడానికే మొగ్గు చూపిస్తున్నట్లు తెలిసింది. దీంతో పవన్ పరిస్థితి ఏంటి..? అనేది తెలియట్లేదు. మరోవైపు అదంతా ఏమీ లేదని పవన్‌ను గెలిపించడానికి వర్మ కష్టపడుతున్నారనే వార్తలూ వస్తున్నాయి. నామినేషన్ కార్యక్రామానికి రావడంతో పాటు.. ప్రచారం మొదలుకుని పోలింగ్ రోజు వరకూ పవన్‌తోనే వర్మ ఉంటారనే టాక్ కూడా నడుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.