చంద్రబాబు ఆస్తులు భారీగా పెరిగాయ్!
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆస్తులు భారీగా పెరిగాయ్. అధికారంలో లేకున్నా ఇలా ఎలా పెరిగాయబ్బా..? అధికారంలో లేకుండానే ఇన్ని ఆస్తులంటే.. అధికారంలోకి వస్తే పరిస్థితేంటనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు అటు ఏపీ ప్రజల్లో.. ఇటు సోషల్ మీడియాలో ఇదే చర్చ సాగుతోంది. గడిచిన ఐదేళ్లలో సుమారు 40 శాతం ఆస్తులు పెరిగినట్లు అఫిడవిట్‌లో స్వయంగా సీబీఎన్ ప్రకటించారు. శుక్రవారం నాడు కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అఫిడవిట్‌లో ఏమేం చెప్పారు..? ఆస్తులు ఎన్ని.. కేసులు ఎన్ని..? అని తెలుసుకోవడానికి జనాలు తెగ ఎగబడ్డారు.
బాబోయ్ ఈ రేంజ్‌లోనా!
చంద్రబాబు, భువనేశ్వరికి కలిపి రూ.931 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇందులో భువనేశ్వరి పేరిటే రూ.895 కోట్ల విలువైన ఆస్తులు ఉండటం గమనార్హం. ఇందులో స్థిరాస్తులు హైదరాబాద్, ఏపీ, తమిళనాడులో ఇళ్లు, పొలాలు ఉన్నాయి. ఇక చరాస్తుల విలువ రూ.810 కోట్లు.. హెరిటేజ్ ఫుడ్స్‌లోని షేర్ల విలువ దాదాపు రూ.763 కోట్లు.. ఇక రూ. కోటి 40 లక్షల విలువైన బంగారం (3.4 కిలోల బంగారం, 41.5 కిలోల వెండి) ఇతర అభరణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా.. ఐదేళ్ల క్రితం అనగా 2019 ఎన్నికల సమయంలో నారా భువనేశ్వరి ఆస్తుల విలువ రూ. 545. 76 కోట్లు కాగా.. 2024 వచ్చేసరికి భారీగా పెరిగి.. రూ.764 కోట్లకు చేరడం అందరూ ఆశ్చర్యపోతున్నారు.
బాబు సంగతేంటి..!
చంద్రబాబు పేరు మీద 4.80 లక్షల విలువైన చరాస్తులు.. 36.31 లక్షల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 2.25 లక్షల విలువైన ఒక అంబాసిడర్ కారు కూడా ఉన్నట్లు తెలిపారు. కుమారుడు లోకేష్‌తో కలిసి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 3 కోట్ల 48 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. హెరిటేజ్ ఫుడ్స్, మెగాబిడ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, నిర్వాణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెరిటేజ్ ఫిన్‌లిస్ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇక చంద్రబాబుపై కీలకమైన అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కామ్, ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్‌మెంట్‌తో పాటు మొత్తం 24 క్రిమినల్ కేసులున్నాయి. ప్రస్తుతం బాబు ఆస్తుల విషయమే నెట్టింట్లో చర్చనీయాంశంగా మారాయి.