అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ పార్టీకి అస్సలు రోజులు కలిసిరావట్లేదు.! ఘోర పరాజయం మూటకట్టుకోవడం, ఒక్కొక్కరుగా కారు దిగి వెళ్లిపోతుండటం, కేసీఆర్ మంచాన పడటం, కవిత అరెస్ట్.. ఎంపీలు, ఎంపీ అభ్యర్థులు సైతం పార్టీని వీడటం.. ఇవన్నీ వరుస బీఆర్ఎస్‌కు వరుస ఎదురుదెబ్బలయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కారు పార్టీలో కారు ఉంది కానీ.. అందులో నేతలే కరువయ్యారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలబెట్టుకోవాలని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు కేసీఆర్. అయినా నాలుగైదుకు మించి సీట్లు గెలిచే పరిస్థితి అస్సలు లేదని సర్వేలు తేల్చిచెబుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రెండు పర్యాయాలు మంత్రి పదవి అనుభవించి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలిచిన బిగ్ షాట్, సీనియర్ నేత తలసాని శ్రీనివాస యాదవ్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలియవచ్చింది.
ఎందుకు రాలేదబ్బా!
హైదరాబాద్‌లో కీలక పార్లమెంట్ స్థానాలైన సికింద్రాబాద్, మాల్కాజిగిరిలో పాగా వేయాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అహర్నిశలు శ్రమిస్తూ.. వ్యూహాలు రచిస్తోంది. వరుస సమావేశాలు ఏర్పాటు చేయడం, కేటీఆర్ పాదయాత్ర, మరోవైపు.. సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రచారం ఇన్ని జరుగుతున్నప్పటికీ.. ఇవన్నీ అటుంచితే కేసీఆర్ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలోనూ ఎక్కడా తలసాని కనిపించలేదు. మరోవైపు.. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కనిపించట్లేదు. వాస్తవానికి.. కేసీఆర్ పుట్టిన రోజున బాపూ.. బాపూ హడావుడి చేసిన తలసాని.. కొద్దిరోజులకే చల్లబడిపోయి చలీ చప్పుడు లేకుండా ఉన్నారు. ఈయన టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన వ్యక్తే. ఒకప్పుడు ఓ వెలిగిన నేత.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రెండు పర్యాయాలు మంత్రిగా కూడా పనిచేసిన నాయకుడు. ఒకప్పుడు టీడీపీలో ఉన్న నేతలంతా ఇప్పుడు ఒక్కొక్కరుగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు. దీంతో త్వరలోనే తలసాని కూడా రేవంత్ గూటికి చేరిపోతారనే చర్చ గట్టిగానే జరుగుతోంది.
మొదట్నుంచీ ఇలా..!
గత పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి తలసాని కొట్లాడి మరీ తన కుమారుడికి టికెట్ ఇప్పించుకున్నారు... ఓడిపోయారు. అదలా ఉంచితే.. ఈసారి తలసానినే బరిలోకి దింపాలని పార్టీ భావించినప్పటికీ అబ్బే అస్సలు కుదరదు పోటీ చేసే ప్రసక్తే లేదని నిర్మొహమాటంగా చెప్పేశారు. దీంతో అటు తిరిగి.. ఇటు తిరిగి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు.. ఎంపీగా పోటీచేయాల్సి వచ్చింది. పోటీ చేయకపోవడం అటుంచితే కనీసం పద్మారావు తరఫున ఎన్నికల ప్రచారం కూడా చేయకపోవడంతో పక్కాగా బీఆర్ఎస్‌కు బై బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. కొందరు.. బీజేపీకి టచ్‌లోకి వెళ్లారని.. అందుకే కిషన్ రెడ్డి గెలుపు కోసం పనిచేస్తున్నారని అంటుంటే.. అబ్బే పోతే గీతే కాంగ్రెస్‌లోకి వెళ్తారే తప్ప.. బీజేపీలోకి పోరని ఇంకొందరు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌కు ఈ బిగ్ షాట్ గుడ్ బై చెప్పేస్తారనే టాక్ నడుస్తోంది.. ఇదే జరిగితే హైదరాబాద్‌లో గులాబీ పార్టీ ఖాళీ అయినట్లే మరి.