అయ్యో.. పాపం రఘురామ!
అవును.. రఘురామకృష్ణరాజును ఎవరికైనా ఈ పరిస్థితుల్లో అయ్యో అనే అనిపిస్తుంది!. ఎందుకంటే అధికారంలో ఉన్న వైసీపీకి చెడ్డయ్యి.. రెబల్‌గా మారి టీడీపీ, జనసేన, బీజేపీ ఏ ఒక్క పార్టీని వదలకుండా సపోర్టు చేసి.. టీడీపీకి అనుకూలంగా చానెల్స్‌లో రోజూ కనిపిస్తూ నానా యాగీ చేసిన రఘురామ ఇప్పుడు అడ్రస్ లేరు. కచ్చితంగా పోటీచేస్తానని.. అది కూడా నరసాపురం నుంచే అని బల్లగుద్ది మరీ చెప్పిన ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు ఆచూకీయే కనిపించట్లేదు. కూటమి ఏర్పడటంలో తనవంతు పాత్ర పోషించిన రఘురామకు ఏదో ఒక పార్టీ కచ్చితంగా టికెట్ ఇస్తుందని అందరూ భావించారు.. అంతకుమించి ఆయన కూడా ఆశపడ్డారు. సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకూ ఆయన్ను ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
వాట్ నెక్స్ట్!!
ఇదిగో సీటు వచ్చేసింది.. అదిగో ప్రకటన మాత్రమే తరువాయి అని ఉండి నియోజకవర్గం టికెట్ విషయంలో టీడీపీ ఏ రేంజులో ఊరించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆఖరికి పసుపు కండువా కూడా కప్పుకున్నారు కూడా. సీన్ కట్ చేస్తే.. ఉండిని వదులుకునే ప్రసక్తే లేదని టీడీపీ అభ్యర్థి రామరాజు గట్టిగా కూర్చోవడం.. నామినేషన్ వేయడం కూడా పూర్తయిపోయింది. ఇందుకోసం తన క్యాడర్ మొత్తాన్ని రోడ్డు మీదికి కూడా తెచ్చారు.. ఆఖరికి చంద్రబాబు అక్కడికెళ్లినా తిరిగి పంపించిన పరిస్థితి. దీంతో ఈ సీటును కదిలించడానికి బాబు సాహసించట్లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రఘురామకు ఒకటి, బీజేపీతో మరో సీటు సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు తెలియవచ్చింది. అది కూడా నరసాపురం పార్లమెంట్ పరిధిలోనే సీటునే సర్దుబాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. టీడీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు అనపర్తి సీటును రఘురామకు కేటాయించాలని హైకమాండ్ భావిస్తోందట.
అయ్యే పనేనా..!
అనపర్తి నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డి బరిలో ఉండగా.. కూటమిలోని బీజేపీ, జనసేన ఆయనకు సహకరించే పరిస్థితులు అస్సలు లేవు. బాహాటంగానే చెప్పేశాయి కూడా. దీంతో కూటమిలో కన్ఫూజన్ వచ్చేసింది. అభ్యర్థిని మారిస్తే అన్నివిధాలుగా సహకరిస్తామని పురంధేశ్వరి కూడా ప్రకటించేయడంతో రఘురామకు లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తోంది. మరోవైపు.. ఉండినే ఫైనల్‌గా ఆర్ఆర్ఆర్‌కు వస్తుందని.. నామినేషన్ మాత్రమే కదా వేసింది వెనక్కి తీసుకోవచ్చు కదా అని రామరాజుపై గట్టిగానే టీడీపీ ఒత్తిడి తెస్తోందట. ఇదే జరిగితే రామరాజుకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టడానికి పార్టీ రెడీగా ఉందట. ఒకవేళ అది కాని పక్షంలో అనపర్తినే రఘురామకు ఇచ్చేస్తారని టాక్. ఏదేమైనప్పటికీ రఘురామకు ఇంకా క్లారిటీ రాకపోవడంతో.. ఉన్న దాన్ని వదులుకుని లేని దానికోసం పాకులాడటం అంటే ఇదేనేమో అన్న విషయం, రాజకీయాలంటే ఎలాగుంటాయ్ అనేది బాగానే అర్థమయ్యి ఉంటుందేమో..!