ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి ఘటన ఎక్కడ్నుంచి.. ఎక్కడికెళ్తోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.! బాబోయ్ ఒకటా రెండా లెక్కలేనన్ని ఎలివేషన్స్.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఒక్కటే మాటల యుద్ధం.. చంద్రబాబు, పవన్, నారా లోకేష్.. ఇలా ఒకరా ఇద్దరా ఎవరి నోట చూసినా సెటైర్లు.. హేళన చేస్తూ నోటికొచ్చినట్లు మాటలు. సీన్ కట్ చేస్తే.. అటు తిరిగి ఇటు తిరిగి విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా మహేశ్వరరావు దగ్గర వచ్చి ఆగింది. ఇక్కడే అసలు సినిమా మొదలైంది. ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అంటూ టీడీపీ మళ్లీ కొత్త పాట పాడుతోంది. ఇందులో బోండా పాత్ర ఉందో లేదో తెలియట్లేదు కానీ.. సొంత పార్టీ నేతలు, ఉమా మాట్లాడిన మాటలను కాస్త గమనిస్తే అడ్డంగా సైకిల్ పార్టీ బుక్కయ్యి.. ఆయన ఇరుక్కున్నారని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చనే గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఆపండి.. మహా ప్రభో!
మొదట సానుభూతి కోసమే 2019లో లాగా.. 2024 ఎన్నికల ముందు వైఎస్ జగన్ రాయి వేయించుకున్నారని అన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత 8 పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి.. సతీష్ అనే యువకుడిని విచారిస్తే క్వార్టర్ మందు ఇచ్చి, 350 రూపాయిలు ఇవ్వకపోయే సరికి దాడి చేశాడని తెలుగు తమ్ముళ్లు అన్నారు. సీన్ కట్ చేస్తే.. దుర్గారావు అనే టీడీపీ నేత, బోండా ఉమాకు అత్యంత ఆప్తుడు దొరికాక సినిమా క్లైమాక్స్‌కు వచ్చినట్టేనని వైసీపీ చెప్పుకుంటోంది. ఇక లాభం లేదని.. తనపై వస్తున్న ఆరోపణలతో రంగంలోకి దిగిన బోండా.. అబ్బే అన్నా క్యాంటిన్లు తీసేశారని కోపం రాయి వేశాడని చెప్పడం.. అంతేకాదు.. ఇప్పుడు ఏ మాత్రం తనపేరు తీసినా సరే జూన్-04 తర్వాత మీ సంగతి చూస్తానని బెదిరించడం ఇవన్నీ చూస్తుంటే ఏదో తేడా కొడుతోందన్న విషయం గమనించొచ్చు. ఇదే బోండా ఉమా.. జగన్‌పై దాడి జరిగిన మరుసటి రోజు కేశినేని నాని, వెల్లంపల్లి కలిసి సింపతీ కోసం చేసిన గులకరాయి డ్రామా అని చెప్పడం గమనార్హం. ఒకసారి బోండా.. ముందు మాట్లాడిన.. తాజాగా మాట్లాడిన మాటలను చూస్తే అసలు సినిమా ఏంటనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
సామెత గుర్తొస్తుంది!
అదేదో సామెత ఉందే.. గుమ్మడి కాయలు దొంగ అంటే... అన్నట్లుగా టీడీపీ పరిస్థితి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. దుర్గారావు అనే వ్యక్తి బోండా ఉమ దగ్గర పనిచేసే వ్యక్తి కావడంతో ఇదంతా ఆయన్ను ఇరికించడానికే జరుగుతోందని ఏకంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు అనడమేంటి..? అనే అనుమానాలు టీడీపీ నేతలకు వస్తున్న పరిస్థితి. అసలు ఆ తప్పు చేయనప్పుడు.. ఎలాంటి సంబంధం లేనప్పుడు ఈ ఘటనకు సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నారు..? ఇవన్నీ కాదు ఎందుకింతలా భుజాలు తడుముకుంటున్నారు..? అనే అనుమానాలు టీడీపీ శ్రేణుల్లో వస్తుండటం గమనార్హం. దీంతో ఇప్పటి వరకూ వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య జరిగిన సోషల్ మీడియా వార్.. ఇప్పుడు ఇలా మీడియాతో మాటలు, బాబు స్పందన.. బోండా రియాక్షన్ చూశాక అసలు వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులను ఎలా డిఫెండ్ చేయాలో కూడా వారికి అర్థం కావట్లేదట. ఈ మొత్తమ్మీద చూస్తే.. బోండా ఎందుకో అడ్డంగా బుక్కయ్యాడు.. ఇరుక్కుపోయాడన్నది మాత్రం క్లియర్ అర్థమైపోతోంది.. ఏం జరుగుతుందో చూడాలి మరి.