తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్.. అదే హవా పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఐతే అదంతా జరిగే పనిలా కనిపించట్లేదు. ఇందుకు తాజాగా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు చేయించిన ఫ్లాష్ సర్వేనే నిదర్శనం. కారణం ప్రత్యర్థులే బలంగా ఉన్నారనీ మనవాళ్ళ గెలుపు కష్టమేనని తేలినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. దీంతో కొడంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తనపై కుట్ర చేస్తున్నారనే వార్తలు సైతం వైరల్ అవుతున్నాయి. ఐతే రేవంత్ ముందే ఊహించారని.. అందుకే ఇప్పుడు ఇలా కాంగ్రెస్ డ్రామాలు చేస్తున్నదని ఆరోపణలు వస్తున్నాయి.
ఏం తేలింది..?
కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది..? ఇప్పటి వరకూ ప్రకటించిన 14 మంది అభ్యర్థుల్లో ఎంత మంది గెలవచ్చు..? కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఎంతశాతం? పార్టీ అభ్యర్థి ఎంపికపై గ్రౌండ్ కేడర్ ఏమనుకుంటున్నారు? లోకల్ నాయకులు సమన్వయంతో పనిచేస్తారా? లేదా? ప్రత్యర్థుల ప్రభావం సెగ్మెంట్లో ఎలా ఉన్నది? అని ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు చేయించిన తాజాగా ఫ్లాష్ సర్వే నిర్వహించారు. ఇందులో కొందరు అభ్యర్థులకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తేలిందని సమాచారం. ఈ రిపోర్టును ఏఐసీసీ నేతల సమక్షంలో నేడు అభ్యర్థుల ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది. దీనిపై సునీల్ కనుగోలు చేయించిన ఫ్లాష్ సర్వే స్పెషల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సైతం ఇవ్వనున్నట్లు బోగట్టా..!
ఏం చేద్దాం.. ఎలా వెళ్దాం..!?
ప్రెజెంటేషన్ తర్వాత గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న అభ్యర్థులకు పోటీలో కొనసాగుతారా? లేక తప్పుకుంటారా? అనే ఆప్షన్ను ఏఐసీసీ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ అంశంపై చర్చించడానికి నేడు హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హోటల్లో మీటింగ్ నిర్వహించి అభ్యర్థులతో సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెల్సింది. ఈ మీటింగులో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్, భట్టి, సునీల్ కనుగోలు, దీపదాస్ మున్షీ పాల్గొననున్నారు. అభ్యర్థుల లోటు పాట్లేంటి..? మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఎంత..? ఎవరి మైనస్లు ఏంటి..? అనే విషయాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఏం తేలుతుంది అనేది చూడాలి మరి.