అవును.. విజయసాయి రెడ్డి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నేను చెప్పాల్సింది చెప్పేశా.. నా చిరకాల కోరిక నెరవేరుస్తారా లేదా అనేది ఆయనిష్టం..! అంతే కాదు అసలు నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకున్నా.. కానీ అధినేత చెప్పేసరికి నా మనసులో ఉన్న విశాఖపట్నం కాకుండా నా పుట్టిన ఊరు నెల్లూరులో పోటీ చేయడం సంతోషంగానే ఉంది. కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇంతకీ సాయిరెడ్డి చిరకాల కోరిక ఏంటి..? వైఎస్ జగన్ వల్ల అయ్యే పనేనా..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం రండి..!!
ఇదీ సంగతి!
పొలిటికల్ రిటైర్మెంట్ తర్వాత తనను గవర్నర్ చేయండని జగన్ ను ఎంపీ విజయసాయి రెడ్డి కోరుకున్నారు. అదే తన చిరకాల కోరిక అని కూడా అధినేతకు మొరపెట్టుకున్నానని స్వయంగా ఓ ఇంటర్వ్యూ వేదికగా వైసీపీ నంబర్ - 2గా ఉన్న, నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి మనసులో మాట చెప్పేసారు. జగన్ నుంచి కూడా సానుకూలంగానే స్పందన వచ్చినట్లే అని ఆయన మాటలను బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు. కేంద్రం చేతిలో ఈ గవర్నర్ గిరి అనేది ఉంటుందన్న విషయం తెలిసిందే. రేపొద్దున ఎన్డీఏ ప్రభుత్వం వస్తే సరే.. లేకుంటే ఇండియా కూటమి గెలిస్తే సాయి రెడ్డి కోరిక ఎలా నెరవేరుతుంది అనేది పెద్ద ప్రశ్నార్థకమే.
ఎంతో మంది వేచి చూసి..!
గవర్నర్ కావాలని ఎవరికి ఉండదు చెప్పండి.. కానీ అది కోరికగానే మిగిలిపోతేనే అంతా బాధ. తెలుగు రాష్ట్రాల్లో ఆ కోరిక చాలా తక్కువ మందే నెరవేర్చుకున్నారు. మరికొందరికి అనుకోకుండా అదృష్టం తలుపు తట్టింది కూడా. ముఖ్యంగా.. మోత్కుపల్లి నరసింహులు, వర్ల రామయ్యలతో పాటు చాలా మంది ఎప్పుడెప్పుడు పదవి వస్తుందా అని వేచి చూస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ పార్టీల అధినేతలు ఆశ చూపిస్తూ.. పబ్బం గడిపేస్తున్నారు. మరి.. ఈ జాబితాలోకి విజయసాయి చేరిపోతారా.. లేకుంటే వైసీపీకి ఇంత చేసిన నంబర్ -2ను గుర్తుపెట్టుకొని చివరి కోరిక నెరవేరుస్తారా అనేది.. చూడాలి మరి.